కొవిడ్‌ సంక్షోభం.. రూ.5వేల కోట్ల నష్టం

113
కొవిడ్‌ సంక్షోభం.. రూ.5వేల కోట్ల నష్టం

ఇండోర్‌ : కొవిడ్‌-19 సంక్షోభం కారణంగా పశ్చిమ రైల్వే సుమారు రూ.5,000 కోట్ల నష్టాల్లో ఉందని, దీంతో సేవలపై ప్రభావం పడనున్నట్లు వెస్ట్రన్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అలోక్‌ కంసల్‌ తెలిపారు. కరోనా మహమ్మారి భయంతో చాలా మంది నేటికీ రైలులో ప్రయాణించేందుకు విముఖత చూపుతున్నారన్నారు. కరోనా సంక్షోభం కారణంగా కోచింగ్‌ రైళ్లు (ప్యాసింజర్‌) విభాగంలో వార్షిక ఆదాయంలో రూ.5వేల కోట్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నామన్నారు. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లలో పదిశాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మహమ్మారికి ముందు పశ్చిమ రైల్వే సుమారు 300 ప్యాసింజర్‌ రైళ్లను నడిపిందని జీఎం తెలిపారు. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత మార్చిలో దేశవ్యాప్తంగా రైల్వే ప్యాసింజర్‌ రైళ్లను నిలిపివేసింది. ప్రస్తుతం 145 ప్యాసింజర్‌ ట్రైన్లను ప్రారంభించామని, రాబోయే వారం రోజుల్లో మరిన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కొవిడ్‌ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్యాసింజర్‌ రైళ్లను ప్రత్యేక రైళ్లుగా నడుపుతోందని, రిజర్వేషన్‌ టికెట్లు ఉన్న వారికి మాత్రమే ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో వెస్ట్రన్‌ రైల్వే పరిధిలో మే 1 నుంచి 31వ తేదీ వరకు 1,234 శ్రామిక్‌ రైళ్లు నడిపామని.. 19లక్షల మందిని వివిధ రాష్ట్రాల్లోని గమ్యస్థానాలకు చేర్చిందని చెప్పారు.