శుక్రవారం 05 జూన్ 2020
National - May 09, 2020 , 13:13:28

బాస్మతీల ఎగవేత.. ఏ బ్యాంకుకు ఎంతెంత?

బాస్మతీల ఎగవేత.. ఏ బ్యాంకుకు ఎంతెంత?

- నాలుగేళ్ల తర్వాత తాపీగా ఎస్బీఐ ఫిర్యాదు.. సీబీఐ చార్జిషీటు

హైదరాబాద్: నత్తనడకలో ఎస్బీఐతో, సీబీఐతో ఆ నత్త కూడా పోటీపడలేదనే అనుకోవాలి. బాస్మతి బియ్యం ఎగుమతి కంపెనీ రాందేవ్ ఇంటర్నేషనల్ ఎస్బీఐతోపాటుగా మొత్తం ఆరు బ్యాంకుల దగ్గర ఒకటికాదు, రెండు కాదు ఏకంగా రూ.400 కోట్లకు పైగా ఎగ్గొట్టింది. 2016లోనే కంపెనీకి ఇచ్చిన రుణాలను ఎన్పీఏలుగా ప్రకటించారు. అదే ఏడాది కంపెనీ యజమానులు దేశం విడిచి దర్జాగా విదేశాలకు పారిపోయారు. ఆ తర్వాత నాలుగేళ్లకు గత ఫిబ్రవరిలో ఎస్బీఐ ఫిర్యాదు నమోదు చేసిందట. దానిపై ఏప్రిల్ 28న సీబీఐ తాపీగా చార్జిషీటు దాఖలు చేసిందట. రాందేవ్ ఇంటర్నేషనల్ ఎస్బీఐకి రూ.173.11 కోట్లు, కెనరా బ్యాంకుకు రూ.76.09 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.64.31 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.51.31 కోట్లు, కార్పోరేషన్ బ్యాంకుకు రూ.36.91 కోట్లు, ఐడీబీఐ బ్యాంకుకు రూ.12.27 కోట్లు.. మొత్తం రూ.414 కోట్లు ఎగ్గొట్టింది. కంపెనీ డైరెక్టర్లు నరేశ్‌కుమార్, సురేశ్‌కుమార్, సంగీత మరియు పలువురు (గుర్తు తెలియని) అధికారులను చార్జిషీటులో నిందితులుగా పేర్కొన్నారు.

2016 జనవరి 27న కంపెనీ అప్పులను ఎన్పీఏలుగా గుర్తించినట్టు ఎస్బీఐ తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. తప్పుడు ఖాతాలతో, బ్యాలెన్స్ షీట్లను మసిపూసి మారేడుకాయ చేసి, బ్యాంకులను ముంచి లబ్ధి పొందేందుకు చట్టవిరుద్ధంగా యంత్రాలు, ప్యాక్టరీలు తరలించినట్టు 2016లోనే స్పెషల్ ఆడిట్‌లో బయటపడిందని కూడా ఎస్బీఐ చావుకబురు చల్లగా చెప్పింది. తనిఖీల సమయంలో యజమానులు కనిపించలేదని, తర్వాత ఆరాతీస్తే వారు దేశం విడిచి పారిపోయినట్టు తెలిసిందని బ్యాంకు మరీ అమాయకంగా సెలవిచ్చింది. ఇంతాచేసి ఫిర్యాదు ఆలస్యమైందని అనడం సబబు కాదంటున్నది. ముసద్దీలాల్ కృష్ణాలాల్ అనే కంపెనీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు దాఖలైన కేసులో ఏడాది క్రితమే ఇదే నిందితులు దుబాయ్‌కి పరారైనట్టు ధ్రువీకరించడమైంది. నిందితులు దేశం విడిచి పారిపోయే ముందే ఆస్తులన్నిటిని అమ్మేశారు కనుక అప్పుల వసూలు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించిన తర్వాతనే ఎస్బీఐ ఫిర్యాదు దాఖలు చేసిందని అధికారులు అంటున్నారు.


logo