శుక్రవారం 22 జనవరి 2021
National - Dec 18, 2020 , 19:35:42

ఢిల్లీ కార్పొరేషన్లలో అవినీతి.. సీబీఐ విచారణకు కేజ్రీ డిమాండ్‌

ఢిల్లీ కార్పొరేషన్లలో అవినీతి.. సీబీఐ విచారణకు కేజ్రీ డిమాండ్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీ సారథ్యంలో పని చేస్తున్న నగర పాలక సంస్థల్లో రూ.2,500 కోట్ల కుంభకోణం జరిగిందని రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఇది 2010 నాటి కామన్‌వెల్త్‌ గేమ్స్‌ స్కాం కంటే పెద్దదని చెప్పారు.  నగర పాలక సంస్థల్లో అవినీతి గురించి చర్చించాల్సి రావడం చాలా బాధాకరం అని ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో అన్నారు. దీనిపై సీబీఐ విచారణను కోరాలని విపక్ష నేత రాంవీర్‌సింగ్‌ భిదూరీకి సూచించారు. నగర పాలక సంస్థలు అవినీతికి మారుపేరుగా మారాయని, ఢిల్లీ ప్రభుత్వం నిజాయితీగా పని చేస్తున్నదని ప్రజలు అభిప్రాయ పడుతున్నారని కేజ్రీవాల్‌ చెప్పారు. 

రూ. 2,500 కోట్లతో నగర పాలక సంస్థల పరిధిలోని పారిశుద్ధ్య సిబ్బంది, వైద్యులు, ఇతర ఉద్యోగుల వేతనాలు చెల్లించవచ్చునని కేజ్రీవాల్‌ చెప్పారు. ఈ నిధులను ఢిల్లీలో 12,500 దవాఖాన బెడ్ల కొనుగోలుకు గానీ, 7,500 మొహల్లా క్లినిక్‌లను ఏర్పాటు చేయడానికి ఉపయోగించొచ్చునన్నారు. 

దేశ రాజధానిలోని మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో ఏటా భవన నిర్మాణాలకు అనుమతుల కోసం రూ.5000-10,000 కోట్ల విలువైన కుంభకోణాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. నగర పాలక సంస్థల పరిధిలో అవినీతికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్‌ అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo