గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 18:18:24

కోవిడ్ నిర్వ‌హ‌ణ‌లో రూ.2 వేల కోట్ల కుంభ‌కోణం : సిద్దరామయ్య

కోవిడ్ నిర్వ‌హ‌ణ‌లో రూ.2 వేల కోట్ల కుంభ‌కోణం : సిద్దరామయ్య

బెంగ‌ళూరు : కోవిడ్ -19 నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్ప‌డింద‌ని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్ర‌తిప‌క్ష నేత‌ సిద్దరామయ్య గురువారం ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో క‌ర్ణాట‌క సీఎం, ఆయ‌న మంత్రులు అమావ‌న‌వీయంగా ప్ర‌వ‌ర్తిస్తూ రూ. 2 వేల కోట్ల‌కు పైగా అవినీతికి పాల్ప‌డ్డార‌న్నారు. దీనిపై హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జీతో పాటు అసెంబ్లీలో చ‌ర్చ జ‌ర‌గాల‌న్నారు. వెంటిలేట‌ర్ల‌కు కూడా ఇత‌రులక‌న్నా ఎక్కువ‌గా ప్ర‌భుత్వం చెల్లిస్తుంద‌న్నారు. 

కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ కింద 50 వేల వెంటిలేటర్లను ఒక్కో యూనిట్‌ను రూ. 4 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. అదే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రూ. 4.78 ల‌క్ష‌ల‌కు కొనుగోలు చేసింది. కాగా క‌ర్ణాట‌క‌లో అది యూనిట్‌కు రూ.5.6 ల‌క్ష‌ల నుంచి రూ. 18.2 ల‌క్ష‌ల మ‌ధ్య ఉందని సిద్ధ‌రామ‌య్య అన్నారు. ఓ వైపు పీఎం మోదీ ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ అని పిలుపునిస్తూ దేశీయ వ‌స్తువుల‌ను ప్రోత్స‌హించాల్సిందిగా చెబుతున్నారు. కానీ అదే పార్టీ సీఎం బీఎస్ య‌డియూర‌ప్ప ప్ర‌భుత్వం మాత్రం అధిక ఖ‌ర్చుతో చైనా వైద్య ప‌రిక‌రాల‌ను దిగుమ‌తి చేసుకుంటుంద‌న్నారు. 

క‌రోనా వైర‌స్‌ మహమ్మారిపై పోరాటంలో ప్ర‌భుత్వానికి తాము స‌హ‌క‌రిస్తామ‌న్నారు. కానీ అవినీతికి, ప్ర‌జ‌ల డ‌బ్బును దోపిడి చేసేందుకు స‌హ‌క‌రించ‌మ‌న్నారు. సిద్ద‌రామ‌య్య ఆరోప‌ణ‌ల‌ను ప్ర‌భుత్వం తోసిపుచ్చింది. మహమ్మారిపై పోరాడటానికి వైద్య పరికరాల సేకరణలో ఎలాంటి అవకతవక6లు జరగలేదంది. ఇదివ‌ర‌కు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నాను. ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని ఆ రాష్ర్ట ఆరోగ్య‌శాఖ మంత్రి బి. శ్రీ‌రాములు తెలిపారు. 


logo