గురువారం 28 మే 2020
National - May 16, 2020 , 21:06:48

రోహిణి జైలులో 17 మంది ఖైదీలకు కరోనా

రోహిణి జైలులో 17 మంది ఖైదీలకు కరోనా

న్యూఢిల్లీ: ఆరోగ్యం బాగోలేదని దవాఖానకు వెళ్లిన ఓ ఖైదీ.. అక్కడ కరోనా వైరస్‌కు గురై తొటి ఖైదీలు 17 మందికి వైరస్‌ను అంటించాడు. ఈ ఘటన న్యూఢిల్లీలోని రోహిణి జైలులో శనివారం వెలుగుచూసింది. ఒక ఖైదీకి ఆరోగ్య సమస్యలు రావడంతో జైలు వార్డర్లు ఆయనను డీడీయూ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స ఇప్పించారు. అనంతరం జైలుకు రాగా ఆయనలో కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించాయి. వెంటనే ఆయనను క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం జైలులోని ఖైదీలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో 17 మందికి పాజిటివ్‌గా తేలింది. దాంతో వారిని కూడా క్వారంటైన్‌ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రోహిణి జైలులోని 19 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపగా.. 17 మందికి పాజిటీవ్‌గా తేలిందని, వీరందిరికి డీడీయూ దవాఖానకు చికిత్స కోసం వెళ్లిన మరో ఖైదీ నుంచి వైరస్‌ సోకినట్లు అనుమానిస్తున్నట్లు జైళ్ల శాఖ ఐజీ సందీప్‌ గోయల్‌ తెలిపారు. ఐదుగురు సిబ్బందికి పరీక్షలు జరుపగా.. వారిలో ఒకరికి పాజిటివ్‌గా వచ్చిందని, ఆయనను హోం క్వారంటైన్‌కు పంపినట్లు వెల్లడించారు. రోహిణి జైలులో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు తేలడంతో ముందు జాగ్రత్తగా తీహార్‌ జైలులో కూడా నిర్ధారణ పరీక్షలు మొదలుపెట్టారు.


logo