శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
National - Jan 25, 2021 , 01:57:04

గుండె శస్త్ర చికిత్సలో దేశీయ రోబో రంగ ప్రవేశం

గుండె శస్త్ర చికిత్సలో దేశీయ రోబో రంగ ప్రవేశం

  • డాక్టర్‌ సుధీర్‌ శ్రీవాత్సవ బృందం ఆవిష్కరణ
  • ఇప్పటికే విజయవంతంగా 18 శస్త్రచికిత్సలు 
  • విదేశీ రోబోల ధర 20 కోట్లు.. 5 కోట్లకే మంత్ర

న్యూఢిల్లీ, జనవరి 24: అత్యాధునిక వైద్య సేవలకు చిరునామాగా మారుతున్న భారత్‌.. అనేక నూతన ఆవిష్కరణలు చేస్తున్నది. అత్యంత క్లిష్టమైన శస్త్ర చికిత్సలు కూడా మన వైద్యులు అతి సులువుగా చేసేస్తున్నారు. శస్త్ర చికిత్సల నిర్వహణలో అత్యాధునిక రోబోలను కూడా వాడుతున్నారు. అయితే, ఇప్పటివరకు వాడుతున్న రోబోలన్నీ అమెరికా నుంచి దిగుమతి చేసుకొన్నవే. కానీ.. ఇప్పుడు అసలు సిసలు భారతీయ సర్జికల్‌ రోబో ఈ రంగంలోకి దూసుకొచ్చింది. అదే ఎస్‌ఎస్‌ఐ మంత్ర..

ఇప్పటివరకు ఆమెరికా నుంచే దిగుమతులు

ఎస్‌ఎస్‌ఐ మంత్ర పూర్తిపేరు.. సుధీర్‌ శ్రీవాత్సవ, ఇండియా-మల్టీ ఆర్మ్‌ నావల్‌ టెలీ రొబోటిక్‌ అసిస్టెన్స్‌ (ఎస్‌ఎస్‌ఐ-ఎంఏఎన్‌టీఆర్‌ఏ). ప్రపంచ ప్రఖ్యాత కార్డియో సర్జన్‌ డాక్టర్‌ సుధీర్‌ శ్రీవాత్సవ కలల యంత్రమిది. మన దేశంలో గతేడాది వరకు గుండె శస్త్ర చికిత్సకు వినియోగించే రోబోలు వివిధ ప్రాంతాల్లో 72 ఉండేవి. అవన్నీ అమెరికా నుంచి.. అది కూడా ఒకే కంపెనీ దిగుమతి చేసుకొన్నవే. వాటి ధర రూ.15-20 కోట్ల మధ్య ఉంటుంది. ఇప్పుడు దేశంలో నెలకొల్పిన 73వ కార్డియో సర్జరీ రోబో ఎస్‌ఎస్‌ఐ మంత్ర పక్కా ఇండియన్‌.. దీని ధర కేవలం 4-5 కోట్లే. దీనిని ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్జీసీఐ)లో నెలకొల్పారు. ఇప్పటికే ఇది 18 గుండె శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తిచేసింది. తాజాగా ఈ నెల 19న ఈ రోబోను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రోబోను ఏపీలోని విశాఖపట్టణంలో ఉన్న మెడికల్‌ టెక్నాలజీ జోన్‌లోనే తయారుచేయటం విశేషం.

అకుంఠిత శ్రమ

సుధీర్‌ శ్రీవాత్సవ 21 ఏండ్ల వయసులో మెడికల్‌ డిగ్రీ చేతబట్టుకొని కెనడా వెళ్లారు. ఆపై అమెరికాకు వలస వెళ్లి వైద్య రంగంలో అనేక విప్లవాలకు కారకుడయ్యారు. ప్రపంచంలో తొలి టోటల్లీ ఎండోస్కోపిక్‌ సింగిల్‌ వెసెల్‌ కరోనరీ ఆర్టరీ బైపాస్‌ (టీఈసీఏబీ) శస్త్రచికిత్సను నిర్వహించింది ఆయనే. ఇప్పటివరకు 1,400 రోబోటిక్‌ శస్త్రచికిత్సలు పూర్తిచేశారు. 2016లో భారత్‌ తిరిగివచ్చిన ఆయన.. కార్డియో సర్జరీ రోబోను దేశీయంగానే తయారుచేయాలని నిర్ణయించారు. అందుకోసం 30 మంది యువ భారతీయ ఇంజినీర్లతో జట్టుకట్టి అనేక కష్టనష్టాలను అధిగమించి చివరకు మంత్రను రూపొందించారు. ‘ఎస్‌ఎస్‌ఐ మంత్ర నిర్వహించిన గుండె శస్త్ర చికిత్సలో నేనూ భాగమయ్యాను. దాని పనితీరు అద్భుతం’ అని ఆర్జీసీఐ మెడికల్‌ డైరెక్టర్‌ సుధీర్‌ రవల్‌ తెలిపారు.

దేశంలో టెలీ సర్జరీ (చిన్నచిన్న పరికరాలు అమర్చిన రోబోలను కంప్యూటర్‌ ద్వారా వైద్యులు నియంత్రిస్తూ నిర్వహించే చికిత్సలు) అవసరం చాలా ఉన్నది. ముఖ్యంగా భారీగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఈ అత్యాధునిక వైద్యసేవలు చేరాలి. ఎస్‌ఎస్‌ఐ మంత్ర ఖరీదు విదేశీ రోబోలతో పోల్చితే నాలుగో వంతు మాత్రమే ఉండనున్నది. దక్షిణాసియా దేశాలకు దీనిని ఎగుమతి చేసేందుకు కూడా చాలా అవకాశాలున్నాయి. ఈ రోబో ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఓ దేదీప్యమానమైన ఉదాహరణ.- డాక్టర్‌ సుధీర్‌ శ్రీవాత్సవ  

VIDEOS

logo