మంగళవారం 07 జూలై 2020
National - Jun 28, 2020 , 13:35:17

చెన్నైలో రోడ్లు నిర్మానుష్యం

చెన్నైలో రోడ్లు నిర్మానుష్యం

తమిళనాడు :  తమిళనాడులో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో కొద్ది రోజుల క్రితం అక్కడ కొన్ని జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. 

చెన్నైలో లాక్‌డౌన్‌ 100 శాతం అమలు పరుస్తుండడంతో ఆదివారం అక్కడి రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. నగరంలోని అమింజికరాయి అనే ప్రదేశంలో రోడ్లన్నీ ఖాళీగా కనబడుతుండగా.. ఒకరిద్దరు బయటికొచ్చినా వెంటనే పోలీసులు వారికి పరిస్థితిని వివరించి ఇండ్లకు పంపుతున్నారు. దీంతోనైనా చెన్నైలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తోందని, తాము కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని కొందరు.. తమిళనాడులో లాగే కరోనా అధికంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లోని జిల్లాల్లో కూడా పూర్తి లాక్‌డౌన్‌ విధించాలని ఇంకొందరు కోరుతున్నారు. 

అయితే తమిళనాడులో ప్రస్తుతం 78335 పాజిటివ్‌ కేసులుండగా.. 44094 మంది డిశ్జార్జి అయ్యారు. 33216 మంది చికిత్స పొందుతుండగా మొత్తం 1025 మంది ఇప్పటివరకు మృతి చెందారు. 


logo