ముంబై, మే 29: దేశ ఆర్ధిక రాజధాని ముంబై ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను సాగిస్తున్న ప్రముఖ ఫార్మాసూటికల్స్ కంపెనీ గ్లెన్‌మార్క్.. అంచనాలకు మించి వృద్ధిరేటును సాధించింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2020-2021 ఆర్థిక సంవత్సరం చివరిది, నాలుగో త్రైమాసికంలో 6.15 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ఫ్యాబిఫ్లూ అమ్మకాలు చివరి త్రైమాసికంలో భారీ ఎత్తున కొనసాగడం వల్ల ఇది సాధ్యపడింది. గత ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల కాలంలో 233.87 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసినట్లు గ్లెన్‌మార్క్ ఫార్మాసూటికల్స్ కంపెనీ తెలిపింది.
2019-2020 చివరి త్రైమాసికంతో పోల్చుకుంటే.. 13 కోట్ల రూపాయలను అధికంగా నెట్ ప్రాఫిట్‌ను సాధించింది. గత ఏడాది ఇదే కాలానికి గ్లెన్‌మార్క్ ఫార్మా నమోదు చేసిన నెట్ ప్రాఫిట్ 220.30 కోట్లు. 2020-2021 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 2,859.90 కోట్ల రూపాయల రెవెన్యూ సాధించినట్లు తెలిపింది. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్‌తో పోల్చుకుంటే ఈ మొత్తం 2,767.50 కోట్ల రూపాయలుగా ఉంది.