శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 20:41:04

నితీశ్ ప్ర‌భుత్వం నిద్ర‌పోతున్న‌ది: తేజ‌స్వియాద‌వ్

నితీశ్ ప్ర‌భుత్వం నిద్ర‌పోతున్న‌ది: తేజ‌స్వియాద‌వ్

ప‌ట్నా: ఒకవైపు క‌రోనా మ‌హ‌మ్మారి, మ‌రోవైపు వరదలు బీహార్‌ను కుదిపేస్తుంటే ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ ప్రభుత్వం నిద్రమత్తులో ఉందని ప్ర‌తిప‌క్ష‌ ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ విమ‌ర్శించారు. క‌రోనా కార‌ణంగా ఉపాధిలేక రాష్ట్ర‌ ప్రజలు అల్లాడుతున్నారని ఆయ‌న‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 75 లక్షల మంది వరదల బారినపడ్డారని, భగల్‌పూర్, దర్బంగా, పూర్ణియా జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని తేజ‌స్వి తెలిపారు. 

వ‌ర‌ద‌లు, క‌రోనాకు తోడు రాష్ట్రంలో ఆరోగ్య సేవలు కుంటుప‌డటంతో ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఓ ట్వీట్‌లో తేజస్వి పేర్కొన్నారు. 40 లక్షల మంది వలస కార్మికులు పనిలేక బలవంతంగా ఇండ్ల‌లోనే ఆకలితో మగ్గిపోతున్నారని, ఆరోగ్య సేవలు కుంటుపడి లక్షలాది మంది కరోనా పేషెంట్లు భగవంతుడిపైనే భారం వేసి కాలం వెళ్లదీస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తంచేశారు. దాదాపు 7 లక్షల మందికి ఉద్యోగాలు లేవని, వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా 15 ఏండ్ల‌ నితీశ్‌ ప్రభుత్వం మాత్రం నిద్రపోతున్న‌ద‌ని ఆయ‌న‌ ఎద్దేవా చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo