సోమవారం 10 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 21:48:00

భారత్ లో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు

 భారత్ లో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు

ఢిల్లీ: భారత్ లో గత 24 గంటల్లో కోలుకున్నవారి సంఖ్య బాగా పెరిగి 51,000 దాటింది. 51,225 మందికి నయమై డిశ్చార్జ్ కావటంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 11,45,629 కు చేరింది. దీంతో కోలుకున్నవారి శాతం గరిష్ఠ స్థాయిలో65.44 శాతానికి చేరింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమన్వయంతో చేస్తున్న కృషికి తోడు వైద్య సిబ్బంది సహా పోరాడుతున్నయోధుల నిస్వార్థ సేవల ఫలితంగా కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. బాధితుల సంఖ్యకూ, కోలుకున్నవారికీ మధ్య తేడా బాగా పెరుగుతూ వస్తున్నది. జూన్ 10 న మొట్టమొదటిసారిగా కోలుకున్నవారి సంఖ్య బాధితులకంటే 1,573 మంది ఎక్కువగా ఉన్నట్టు నమోదైంది.

ప్రస్తుతం అది 5,77,899 కి చేరింది. ఇంకా బాధితులుగా ఉన్నవారు మాత్రమే భారం కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 5,67,730 గా ఉంది. అంటే ఇది మొత్తం బాధితులలో 32.43శాతం. వీరిలో ఎక్కువమంది ఆస్పత్రులలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ ఉండగా ఇంకొందరి ఇళ్ళలో ఐసొలేషన్ లో ఉన్నారు. నివారణకు తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న వ్యూహం, దూకుడుగా పరీక్షలు జరపటం, ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన చికిత్సావిధానం పాటించటం ఫలితంగా కోలుకుంటున్నవారి శాతం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. అదే సమయంలో మరణాల రేటు బాగా తగ్గుతూ వచ్చింది. ప్రపంచంలో మరణాలు తక్కువగా నమోదైన దేశాలలో భారత్ ఒకటిగా నిలిచింది. ప్రపంచ సగటు కంటే తక్కువగా భారత్ లో 2.13శాతంమరణాలు నమోదయ్యాయి.


logo