మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 21:10:14

రాజస్థాన్ లో రాజీనామాల పర్వం

రాజస్థాన్ లో రాజీనామాల పర్వం

జైపూర్ : రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పూటపూటకు రాజకీయాలు మారుతున్నాయి. సచిన్ పైలట్ కు మద్దతుగా పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాలు ప్రకటించారు. మరోవైపు, ఎల్లుండి మంత్రివర్గవిస్తరణ చేపట్టేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ కసరత్తు చేస్తున్నారు.

సీఎం అశోక్ గెహ్లాట్ కు వ్యతిరేకంగా గళమెత్తిన సచిన్ పైలట్ ను డిప్యూటీ సీఎం పదవి నుంచి, అలాగే రాజస్థాన్ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తొలగించింది. అలాగే, సచిన్ పైలట్ కు మద్దతుగా నిలిచిన మంత్రులు విశ్వేంద్ర సింగ్, రమేశ్ మీనాలపై కూడా వేటువేశారు. సచిన్ పైలట్ స్థానంలో గోవింద్ సింగ్ ను పార్టీ నియమించింది. మరో ఎమ్మెల్యే గణేశ్ గోగ్రాను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రదేశ్ సేవాదళ్ అధ్యక్షుడిగా హేం సింగ్ షెకావత్ ను నియమించారు.

కాగా, సచిన్ పైలట్ పై కాంగ్రెస్ అధిష్ఠానం చర్యలపై పలువురు కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి పనిచేసిన పైలట్ ను కాదని గెహ్లాట్ ను సీఎం పీఠం కూర్చోబెట్టి కాంగ్రెస్ పెద్ద తప్పు చేసిందని ఆరోపిస్తూ దాదాపు 59 మంది కాంగ్రెస్ నాయకులు తమ పదవులతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. 

సీఎం అశోక్ గెహ్లాట్ ఆధ్వర్యంలో జరిగిన సీఎల్పీ సమావేశానికి సచిన్ పైలట్ తోపాటు 22 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. వీరితో పాటు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా క్యాంప్ లోనే ఉన్నారు. కాగా, సచిన్ పైలట్ కు కాంగ్రెస్ లో ఇంకా మార్గాలు మూసుకుపోలేదు. ఆయనను పీసీసీ అధ్యక్ష పదవితోపాటు డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించిన పార్టీ హైకమాండ్.. ఆయనను పార్టీ నుంచి మాత్రం సస్పెండ్ చేయలేదు.

మరోవైపు, మంత్రివర్గాన్ని విస్తరించేందుకు ఇదే అదనుగా సీఎం అశోక్ గెహ్లాట్ పావులు కదుపుతున్నారు. ఉద్వాసనకు గురైన మంత్రులతోపాటు ఖాళీగా ఉన్న 8 మంత్రి పదవులను భర్తీ చేసేందుకు ఈ నెల 16 ను ముహూర్తంగా ఖరారు చేశారు. ఈ విస్తరణలో ఎవరికి పదవులు దక్కుతాయో.. ఎవరు పార్టీ అధిష్ఠానంపై కన్నెర్ర చేస్తారో.. ఎవరు పైలట్ వైపు వెళతారో... రెండు రోజులు వేచి చూస్తే తెలుస్తుంది.


logo