మంగళవారం 14 జూలై 2020
National - Jun 30, 2020 , 08:12:43

తునికాకు కోసం యాభై గ్రామాల ప్ర‌జ‌లు ఏకతాటిపైకి!

తునికాకు కోసం యాభై గ్రామాల ప్ర‌జ‌లు ఏకతాటిపైకి!

రాయ్‌పూర్‌: ఛ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని చాలా గ్రామాల ప్ర‌జ‌లు బీడీలు చుట్ట‌డానికి వినియోగించే తునికాకును సేక‌రించి, దాన్ని అమ్మ‌డం ద్వారా వ‌చ్చే ఆదాయంతో జీవ‌నోపాధి పొందుతున్నారు. అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ, లాక్‌డౌన్ అమ‌లు లాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో గ‌త రెండు మూడు నెల‌లుగా తునికాకును సేక‌రించ‌డం కుద‌ర‌లేదు. ఇప్పుడు సేక‌రిద్దామంటే అందుకు అస‌ర‌మ‌య్యే ఖ‌ర్చుల‌కు జ‌నాల ద‌గ్గ‌ర డ‌బ్బులేదు. దీంతో జిల్లాలోని దాదాపు 50 గ్రామాల ప్ర‌జ‌లు ఏక‌తాటిపైకి వ‌చ్చి కాలిన‌డ‌కన క‌లెక్ట‌ర్ కార్యాల‌యానికి చేరుకున్నారు. 

క‌లెక్ట‌ర్ కార్యాల‌యం ముందే అంద‌రూ ధ‌ర్నాకు దిగారు. తునికాకు సేక‌ర‌ణ కోసం త‌మ‌కు న‌గ‌దు సాయం చేయాల‌ని, లాక్‌డౌన్ కార‌ణంగా ఉత్ప‌న్న‌మైన త‌మ స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించాల‌ని డిమాండ్ చేస్తూ క‌లెక్ట‌రేట్ ఆవ‌ర‌ణ‌లో బైఠాయించారు. జ‌నం భారీగా త‌ర‌లిరావ‌డంతో పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసి క‌లెక్ట‌ర్ ఆఫీస్‌లోకి గుంపులుగా వెళ్ల‌కుండా నిలువ‌రించారు. 

అయితే, త‌న కార్యాల‌యం ముందు భారీ జ‌న సందోహాన్ని చూసిన క‌లెక్ట‌ర్ వారిని లోప‌లికి అనుమ‌తించాల‌ని ఆదేశించ‌డంతో.. జ‌నం బారీకేడ్ల‌ను తోసుకుని గుంపులుగా క‌లెక్ట‌రేట్లోకి ప‌రుగులు తీశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సానుకూలంగా స్పందించ‌డంతో వారు శాంతించారు. తునికాకు సేక‌ర‌ణ కోసం రెండు రోజుల్లో న‌గదు సాయం చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ హామీ ఇచ్చిన‌ట్లు వారు తెలిపారు. ఒక‌వేళ రెండురోజుల్లో సాయం అంద‌క‌పోతే మళ్లీ ఆందోళ‌న‌కు దిగుతామ‌ని హెచ్చ‌రించారు.


logo