గురువారం 21 జనవరి 2021
National - Dec 23, 2020 , 18:46:52

దేశంలో 51 శాతం పెర‌గ‌నున్న‌ ఇళ్ల అమ్మకాలు!

దేశంలో 51 శాతం పెర‌గ‌నున్న‌ ఇళ్ల అమ్మకాలు!

న్యూఢిల్లీ: దేశంలోని ఏడు ప్ర‌ధాన న‌గ‌రాల్లో అక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్ త్రైమాసికంలో ఇళ్ల అమ్మ‌కాలు 51 శాతం మేర పెర‌గ‌నున్న‌ట్లు ప్రాప‌ర్టీ క‌న్స‌ల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా వెల్ల‌డించింది. పండ‌గ‌ల సీజ‌న్ కావ‌డంతో అంత‌కు ముందు త్రైమాసికంతో పోలిస్తే.. ఈ త్రైమాసికంలో అమ్మ‌కాలు భారీగా పెరిగిన‌ట్లు అంచ‌నా వేసింది. జులై-సెప్టెంబ‌ర్ త్రైమాసికంలో 14415 యూనిట్ల అమ్మ‌కాలు ఉండ‌గా.. డిసెంబ‌ర్‌తో ముగిసే త్రైమాసికంలో ఇది 21,832 యూనిట్ల‌కు పెర‌గ‌నున్న‌ట్లు అంచ‌నా వేసింది. క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా ఉద్యోగ భ‌ద్ర‌త లేకుండా పోవ‌డం, ఆదాయాలు త‌గ్గిన నేప‌థ్యంలో ఇళ్ల అమ్మ‌కాలు ఈ స్థాయిలో పెర‌గ‌డం శుభ ప‌రిణామ‌మే అని జేఎల్ఎల్ ఇండియా సీఈవో ర‌మేష్ నాయ‌ర్ అన్నారు. 

జులై-సెప్టెంబ‌ర్ త్రైమాసికంలోనే అమ్మ‌కాలు 34 శాతం పెరిగిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అన్ని న‌గ‌రాల్లోనూ రిక‌వ‌రీ స‌మానంగా ఉన్న‌ద‌ని ర‌మేష్ తెలిపారు. 2021లో హౌసింగ్ మార్కెట్ ఓ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. అయితే ఓవ‌రాల్‌గా ఏడాది స‌గ‌టు చూసుకుంటే.. 2020లో ఇళ్ల అమ్మ‌కాలు 48 శాతం మేర త‌గ్గుతాయ‌ని జేఎల్ఎల్ అంచ‌నా వేస్తోంది. ఏడు ప్ర‌ధాన న‌గ‌రాలలో హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు, ఢిల్లీ, కోల్‌క‌తా, ముంబై ఉన్నాయి. 


logo