బుధవారం 21 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 16:15:45

జీతాలు చెల్లించడం లేదంటూ వైద్యుల నిరసన

జీతాలు చెల్లించడం లేదంటూ వైద్యుల నిరసన

న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా జీతాలు చెల్లించడంలేదని ఆరోపిస్తూ ఢిల్లీలోని హిందూ రావు ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన రెసిడెంట్ వైద్యులు మంగళవారం నిరసన తెలిపారు. జీతాల ఆలస్యంపై తాము ఆరు నెలలుగా పోరాడుతున్నామని వాపోయారు. గత 106 రోజులకు సంబంధించి తమకు వేతనాలు అందలేదని ఆరోపించారు. దవాఖాన యంత్రాంగం తమ మొర ఆలకించడం లేదని రెసిడెంట్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు వైద్యులు, పారామెడికల్ సిబ్బందికి జూన్ వరకు జీతాలు చెల్లించినట్లు ఢిల్లీ నార్త్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జై ప్రకాష్ తెలిపారు. కరోనా పోరాటంలో ముందున్న నేపథ్యంలో జీతాల చెల్లింపులో వారికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. మిగతా నెలల జీతాలను త్వరలోనే చెల్లిస్తామని వెల్లడించారు. నిరసన చేస్తున్నవారు శాంతి వహించాలని ఆయన కోరారు.

కాగా, కరోనా పోరులో ముందున్న వైద్యులు, ఇతర సిబ్బందికి జీతాలు సకాలంలో చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసింది. అయినప్పటికీ కొన్ని రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ దవాఖానల్లో పని చేసే వైద్యులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని ఈ కేసు విచారణ సందర్భంగా కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలిపింది. దీంతో ఆయా దవాఖానలపై కరోనా నియంత్రణ చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుపై విచారణ ఇంకా కొనసాగుతున్నది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo