శనివారం 30 మే 2020
National - May 11, 2020 , 01:00:56

రేపటి నుంచి రైలు కూత

రేపటి నుంచి రైలు కూత

  • నేటి నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రిజర్వేషన్‌
  • 15 ‘రాజధాని ఎక్స్‌ప్రెస్‌' మార్గాల్లో 30 ఏసీ రైళ్లు
  • సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్‌కు సమానంగా చార్జీల వసూలు
  • గంట ముందుగా  రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలి
  • వైద్య పరీక్షల తర్వాతే రైలు ఎక్కేందుకు అనుమతి

న్యూఢిల్లీ, మే 10: ప్రయాణికుల రైళ్లు మంగళవారం నుంచి మళ్లీ కూతపెట్టనున్నాయి. దేశంలోని వివిధ రాష్ర్టాల రాజధానులకు, ఢిల్లీకి మధ్య తిరిగే 15 మార్గాల్లో రైలు సేవలను పునరుద్ధరించనున్నట్లు రైల్వే శాఖ ఆదివారం తెలిపింది. ఈ మార్గాల్లో దిబ్రుగఢ్‌, అగర్తల, హౌరా, పాట్నా, బిలాస్‌పూర్‌, రాంచి, భువనేశ్వర్‌, సికింద్రాబాద్‌, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్‌, ముంబై సెంట్రల్‌, అహ్మదాబాద్‌, జమ్ము తావి స్టేషన్లు ఉండనున్నాయి. ఢిల్లీకి ఆయా స్టేషన్లకు 15 చొప్పున ఇరువైపులా 30 రైళ్లు తిరుగనున్నాయి. ఇవన్నీ ఏసీ సర్వీసులే అని రైల్వేశాఖ పేర్కొంది. వీటిలో సూపర్‌ ఫాస్ట్‌ ట్రైన్‌ సమానమైన చార్జీలను వసూలు చేస్తామని, ఈ చార్జీలపై ఎటువంటి రాయితీలు ఉండబోవని చెప్పింది. రైళ్లలోని సీట్ల సంఖ్యకు సమానంగా పూర్తి సామర్థ్యంతో నడపుతానని పేర్కొంది. నిర్ణీత రైల్వే స్టేషన్లలోనే ఆగే ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణానికి సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి కేవలం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మాత్రమే రిజర్వేషన్‌ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ప్రయాణికులు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే నిబంధనల వివరాలు ఈ టికెట్లలో ఉంటాయని పేర్కొంది. నిర్దేశించిన నిబంధనలను ప్రయాణికులు తప్పక పాటించాలని సూచించింది. ప్రత్యేక రైళ్ల రాకపోకల సమయాన్ని త్వరలో వెల్లడిస్తామన్నది. రైల్వే స్టేషన్లలోని టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లన్నీ మూసే ఉంటాయని, ప్ల్లాట్‌ఫాం టికెట్లు సహా ఎలాంటి టికెట్ల విక్రయాలు జరుగవని తెలిపింది. కొవిడ్‌-19 వైద్య కేంద్రాలుగా ఉన్న 20 వేల కోచ్‌లు, 300కుపైగా ప్రత్యేక శ్రామిక్‌ రైళ్ల కోచ్‌లు అందుబాటులోకి వచ్చాక క్రమంగా మిగతా ప్రయాణ రైళ్లను పునరుద్ధరిస్తామని పేర్కొంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 25 నుంచి ప్రయాణికుల రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తొలుత రవాణా రైళ్లను పునరుద్ధరించిన రైల్వే, ఇటీవల వలస కార్మికుల కోసం ప్రత్యేక శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్నది. 

ప్రయాణికులకు  ఈ  నిబంధనలు తప్పనిసరి 

  • రిజర్వేషన్‌ టికెట్‌ ఉన్నవారికే ప్రయాణానికి అనుమతి
  • ప్రయాణానికి గంట ముందుగా స్టేషన్‌కు చేరుకోవాలి 
  • కరోనా లక్షణాలు లేవని తేలిన తర్వాతే అనుమతి
  • ముఖానికి మాస్కు ధరించడం తప్పనిసరి
  • ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
  • రైళ్లలో దుప్లట్లు, టవల్స్‌ వంటివి సమకూర్చరు


logo