మన దేశంలో ప్రత్యేక వంటకాలు లేకుండా ఏ సంబరం సంపూర్ణం కాదు..! పైగా ఆ సంబరం అనేది దేశమంతటా జరిగేది అయితే ఇంకా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..! 1950, జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది..! అప్పటి నుంచి ప్రతి ఏడాది జనవరి 26న ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం..! ఈ క్రమంలో ఈ ఏడాది కూడా గణతంత్ర దినోత్సవం రానే వచ్చింది..! దేశ ప్రజలంతా రిపబ్లిక్ డే మూడ్‌లో ఉన్నారు..! దేశ పౌరులుగా భిన్న సంస్కృతుల సమ్మిళితమైన మన దేశాన్ని గౌరవించుకోవడం కంటే గొప్ప ఇంకేముంటుంది..? కాబట్టి ఈ ప్రత్యేకమైన రోజును కింద పేర్కొన్న కొన్ని ప్రత్యేకమైన వంటకాలతో ఎంజాయ్ చేద్దాం..?
1. ట్రై కలర్ పనీర్ చీజ్ చీకులు
గణతంత్ర దినోత్సవ వేళ మువ్వన్నెల పనీర్ చీకులను ఇంట్లోనే చేసుకుని ఎంజాయ్ చేయండి. పనీర్ ముక్కలను కాషాయం, తెలుపు, అకుపచ్చ రంగు సాస్‌లలో నానబెట్టి తీసి, చీకులకు గుచ్చి కాల్చుకోవడం ద్వారా ఈ వెరైటీ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ చూడటానికి అందంగానే కాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
2. మువ్వన్నెల బిర్యానీ
మన దేశంలో బిర్యానీ పాపులర్ వంటకం. బిర్యానీ చేయడం చాలామందికి తెలుసు. రిపబ్లిక్ డే సందర్భంగా మీకు వచ్చిన వంటకానికే కొంచెం అదనపు హంగులు అద్ది మువ్వన్నెల బిర్యానీని తయారు చేసుకోవచ్చు. బిర్యానీల్లో వినియోగించే ఫుడ్ కలర్స్ ద్వారానే ఈ స్పెషల్ బిర్యానీకి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు వచ్చేలా చేసుకోవచ్చు.
3. ట్రై కలర్ ఫ్రూట్ సాండే
ఏ ఫంక్షన్ అయినా భోజనం తర్వాత తీసుకునే ఫ్రూట్ సాండే లేనిదే పూర్తికాదు. ఐస్‌క్రీమ్, పండ్ల ముక్కలను కలగలిపి ఈ రెసిపీని చేస్తారు. అలాంటి ఫ్రూట్ సాండేని రిపబ్లిక్ డే రోజున మరింత ప్రత్యేకంగా మూడు రంగుల్లో చేసుకుంటే బాగుంటుంది. ఆకుపచ్చ రంగు కోసం కివీపండు ముక్కలను, తెలుపు కోసం అరటిపండు ముక్కలను, కాషాయం కోసం సంత్రాపండు ముక్కలను వేసుకుని తీసుకుంటే సరిపోతుంది.
4. మువ్వన్నెల పాస్తా
గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ ఇంట్లో చేసుకునే ఇటాలియన్ వంటకానికి భారత హంగులు అద్దాలని భావిస్తున్నారా..? అయ్యితే మువ్వన్నెల పాస్తా మీ కోరికను సంతృప్తి పరుస్తుంది. ఇటలీ వంటకమైన పాస్తాను మూడు రంగుల్లో చేసుకోవడం తేలిక. పాస్తా ఎలాగూ తెలుపు రంగులోనే ఉంటుంది. కాషాయం, ఆకుపచ్చ రంగుల కోసం క్యారట్, బ్రకోలి లాంటి కూరగాయలను వినియోగిస్తే సరిపోతుంది.
5. త్రివర్ణ ఇడ్లీ
దాదాపు భారతీయులంతా దక్షిణాది ప్రత్యేక వంటకమైన ఇడ్లీని అమితంగా ఇష్టపడుతారు. ఎందుకంటే ఇది తేలిగ్గా జీర్ణమవడమేగాక, ఆరోగ్యానికి మంచిది కూడా. మరి ఈ ఇడ్లీని రిపబ్లిక్ డే స్పెషల్‌గా మూడు రంగుల్లో చేసుకుంటే ఎంత బాగా ఉంటుంది కదా..! అది చాలా సింపుల్ కూడా. తెల్లటి ఇడ్లీల కోసం నీళ్లను, కాషాయం ఇడ్లీల కోసం క్యారట్ రసాన్ని, ఆకుపచ్చ ఇడ్లీల కోసం పాలకూర రసాన్ని వేసి కలుపుకుంటే ట్రై కలర్ ఇడ్లీ రెడీ అవుతుంది.