శుక్రవారం 05 జూన్ 2020
National - May 12, 2020 , 00:46:36

సామూహిక వ్యూహం?

సామూహిక వ్యూహం?

  • ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ అమలుకు కేంద్రం ప్రణాళికలు
  • ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు యత్నం
  • దాంట్లో భాగమే సడలింపులు, ఆంక్షల ఎత్తివేత!

న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఒకవైపు మూడో దశ లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది. అయితే, కేసుల సంఖ్యలో మాత్రం తగ్గుదల కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో సామూహిక రోగనిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ)ని పెంచితేనే మహమ్మారిని కట్టడి చేయవచ్చని కొందరు వైద్య నిపుణులు, అంటువ్యాధులపై అధ్యయనం చేసే పరిశోధకులు పేర్కొంటున్నారు. కొవిడ్‌-19 కొత్త మార్గదర్శకాల పేరిట నిబంధనల్లో సడలింపులనిస్తూ ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ విధానాన్ని అవలంభించే దిశగా కేంద్రం పావులు కదుపుతున్నదని విశ్లేషకులు అంటున్నారు.   

లాక్‌డౌన్‌కి మించి కావాలి!

మూడోదశ లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ.. దేశంలో వైరస్‌ కేసులు సోమవారంనాటికి 67,152కు చేరుకున్నాయి. కరోనాను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ అవసరమని, అయితే ఇదే పరిష్కారం కాదని నిపుణులు అంగీకరిస్తున్నారు. ఇదే సమయంలో కరోనాను కట్టడి చేసేందుకు జపాన్‌ అనుసరించిన ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ వ్యూహాన్ని ప్రస్తావిస్తున్నారు. 

నిరోధక శక్తిని పెంచడానికేనా!

తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ దవాఖాన నుంచి కరోనా రోగులు డిశ్చార్జీ కావచ్చని కేంద్రం ఇటీవల కొత్త మార్గదర్శకాల్ని జారీ చేసింది. అయితే, దవాఖాన నుంచి డిశ్చార్జీ అయిన రోగుల ద్వారా మరికొందరికి వైరస్‌ సోకుతుందని నిపుణులు చెబుతున్నారు. రోగుల్ని డిశ్చార్జీ చేసే వ్యూహం దేశంలో ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ని నెలకొల్పడంలో సాయపడుతుందని అంచనా వేస్తున్నారు. 


logo