గురువారం 02 ఏప్రిల్ 2020
National - Mar 02, 2020 , 18:20:04

ఉరి వాయిదా.. వ్యవస్థ వైఫల్యమే..

ఉరి వాయిదా.. వ్యవస్థ వైఫల్యమే..

న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు మరోసారి ఉరి వాయిదా పడడంతో నిర్భయ తల్లి ఆశాదేవీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉరి శిక్ష మరోసారి వాయిదా పడడం మన వ్యవస్థ వైఫల్యమే అని ఆమె పేర్కొన్నారు. మన వ్యవస్థ మొత్తం నేరస్థులకే మద్దతు ఇస్తుందన్నారు. సొంత డెత్ వారెంట్ ఉత్తర్వులను అమలు చేసేందుకు కోర్టు ఎందుకింత జాప్యం చేస్తుందని ఆశాదేవీ ప్రశ్నించారు. ఉరిశిక్ష పదేపదే వాయిదా పడడం మన వ్యవస్థ వైఫల్యమే అని ఆమె స్పష్టం చేశారు. 

గతంలో ఇచ్చిన డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ నిందితుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా సోమవారం ఉదయం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున స్టే ఇవ్వాలని పిటిషన్‌లో గుప్తా కోరాడు. దీంతో విచారణ అనంతరం ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. స్టే ఇవ్వడం ఇది మూడోసారి. జనవరి 22, ఫిబ్రవరి 1న ఉరి తీయాలంటూ ఇచ్చిన డెత్‌ వారెంట్లపై కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని గతంలో కోర్టు డెత్‌ వారెంట్లు ఇచ్చింది. కానీ గుప్తా పిటిషన్‌తో అది కూడా ఆగిపోయింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డెత్‌ వారెంట్లపై స్టే విధించింది పటియాలా హౌస్‌ కోర్టు.


logo