శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 26, 2020 , 17:16:55

బ్రెయిన్‌ క్యాన్సర్‌తో ఆర్థికవేత్త ఐషర్‌ అహ్లువాలియా కన్నుమూత

బ్రెయిన్‌ క్యాన్సర్‌తో ఆర్థికవేత్త ఐషర్‌ అహ్లువాలియా కన్నుమూత

న్యూఢిల్లీ : ప్రముఖ ఆర్థికవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత జస్టిస్ అహ్లువాలియా (74) బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతూ శనివారం కన్నుమూశారు. ఆమె ప్లానింగ్ కమిషన్ మాజీ డిప్యూటీ చైర్మన్‌ మాంటెక్ సింగ్ అహ్లువాలియా సతీమణి. అహ్లువాలియా దంపతులకు ఇద్దరు కుమారులు పవన్‌, అమన్‌. ఐషర్‌ అహ్లువాలియా 15 సంవత్సరాలుగా థింక్-ట్యాంక్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్‌ఐఈఆర్‌) చైర్‌పర్సన్‌గా కొనసాగగా.. అనారోగ్యంతో గత నెలలో పదవి నుంచి వైదొలిగారు. ఆర్థిక వృద్ధి, ఉత్పాదకత, పారిశ్రామిక, వాణిజ్య విధాన సంస్కరణలు, పట్టణ ప్రణాళిక, అభివృద్ధి వంటి రంగాల్లో ఆమెకు విస్తృత అనుభవం ఉంది.

ఐసీఆర్‌ఐఈఆర్‌లో ఆమె భారతదేశంలో పట్టణీకరణ సవాళ్లపై ప్రధాన పరిశోధన, సామర్థ్య అభివృద్ధి కార్యక్రమానికి నాయకత్వం వహించారు. 2009లో విద్య, సాహిత్య రంగంలో ఆమె చేసిన సేవలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ ఐషర్ అహ్లువాలియా భారతదేశపు అత్యంత విశిష్ట ఆర్థికవేత్తల్లో ఒకరు ‘నా గత టర్మ్‌లో స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్‌గా కొనసాగారు. ఆమెతో కలిసి పని చేసే అవకాశం దక్కింది’. అన్నారు.  ‘ఐషర్‌ నా ప్రియమిత్రురాలు, అద్భుతమైన మేధావి, ఆర్థికవేత్త కాన్సర్‌తో సాహసోపేతమైన పోరాటం తర్వాత మరణించింది’. మాంటెక్ సింగ్ అహ్లువాలియా, కుమారులకు నా ప్రగాఢ సంతాపం’ అంటూ బయోకాన్ చైర్‌పర్సన్‌, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా ట్వీట్‌ చేశారు.