శుక్రవారం 10 జూలై 2020
National - Jun 27, 2020 , 21:16:01

1962లో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలి: శరద్‌పవార్‌

1962లో ఏం జరిగిందో గుర్తుంచుకోవాలి: శరద్‌పవార్‌

ముంబై: జాతీయ భద్రతా విషయాలను రాజకీయం చేయవద్దని, 1962 యుద్ధం తరువాత చైనా పెద్ద మొత్తంలో భూములను ఆక్రమించినప్పుడు ఏమి జరిగిందో గుర్తుంచుకోవాలని ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ చైనా ఆక్రమణకు భారత భూభాగాన్ని అప్పగించారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలకు సమాధానంగా పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘1962 లో చైనా 45,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించినప్పుడు ఏమి జరిగిందో మనం మరచిపోలేం. ఈ ఆరోపణలు చేస్తున్నప్పుడు, గతంలో ఏమి జరిగిందో కూడా చూడాలి. ఇది జాతీయ ప్రయోజనానికి సంబంధించిన సమస్య. ఇక్కడ రాజకీయాలను తీసుకురాకూడదు ’ అని సతారాలో నిర్వహించిన  విలేకరుల సమావేశంలో శరద్‌పవార్‌ మాట్లాడారు. గాల్వన్ వ్యాలీ వద్ద ప్రతిష్టంభనకు కేంద్రాన్ని నిందించలేమని ఎన్‌సీపీ చీఫ్‌ వ్యాఖ్యానించారు. ‘భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్న చైనా సైనికులను భారత బలగాలు వెనక్కి నెట్టేందుకు ప్రయత్నించాయి. ఇది రక్షణ మంత్రి వైఫల్యం అని చెప్పడం సరైనది కాదు. మన సైన్యం అప్రమత్తంగా ఉండకపోతే, చైనా వాదన మనకు తెలియదు కదా’ అని శరద్‌ పవార్‌ అన్నారు.  ఈ విషయంలో ఆరోపణలు చేయడం న్యాయం కాదని ఆయన రాహుల్‌గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.  logo