శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Oct 21, 2020 , 03:08:37

పండుగ కళ తప్పనీయొద్దు

పండుగ కళ తప్పనీయొద్దు

  • నిర్లక్ష్యంతో భారీ మూల్యం 
  • కరోనా ముప్పు పొంచే ఉంది
  • పండుగ వేళ అజాగ్రత్త వద్దు
  • ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగం

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ ముగిసినా, కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పొంచే ఉన్నదన్న విషయాన్ని మర్చిపోవద్దని దేశ ప్రజలను ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. పండుగ సీజన్‌ నేపథ్యంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా పండుగ కళ తప్పుతుందన్నారు. మంగళవారం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. చాలా మంది కరోనా జాగ్రత్తలు పాటించట్లేదని, ఇది సరికాదని చెప్పారు. మాస్క్‌ ధరించకుండా నిర్లక్ష్యంగా బయట తిరిగితే మీతోపాటు మీ పిల్లలను, పెద్దలను కూడా ప్రమాదంలోకి నెడుతారని పేర్కొన్నారు. ‘కరోనాను మనం చాలా వరకు కట్టడి చేశాం. ప్రపంచంలోనే మన దేశంలో రికవరీ రేటు అత్యధికంగా ఉన్నది. మరణాల రేటు అతి తక్కువగా ఉన్నది. పది లక్షల జనాభాకు 83 మరణాలే నమోదవుతున్నాయి. ఇతర దేశాల్లో ఇది 600కుపైగా ఉన్నది. అగ్నిని, శత్రువును, వ్యాధిని తక్కువ చేసి చూడొద్దు. కరోనాకు మందు లభించేంత వరకు నిర్లక్ష్యం వద్దు.  టీకా అందుబాటులోకి రాగానే, ప్రతి ఒక్కరికీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది’ అని ప్రధాని పేర్కొన్నారు.