యోగ, ధ్యానంతో ఒత్తిడి నుంచి ఉపశమనం: ఉపరాష్ట్రపతి వెంకయ్య

హైదరాబాద్ : యోగ, ధ్యానంను దైనందిన జీవితంలో భాగం చేసుకోవడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా నూతన జీవనశైలి కారణంగా వస్తున్న ఒత్తిడిని, అసంక్రమిత వ్యాధులను నివారించుకోగలమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శారీరక వ్యాయామానికి, మానసిక సంతులనానికి యోగా ఓ చక్కటి సాధనమని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఆదివారం ఏర్పాటు చేసిన అంతర్జాల వేదిక ద్వారా ‘సొసైటీ ఆఫ్ కరోనరీ సర్జన్స్’ను ఆయన ప్రారంభించారు.
ఇటీవల కాలంలో హృదయ సంబంధిత సమస్యలు పెరుగుతుండటానికి కారణం ప్రజల జీవనశైలిలో వస్తున్న మార్పులేనన్న శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని గుర్తుచేశారు. ఆధునిక జీవన పద్ధతుల కారణంగా హృదయ సంబంధ సమస్యలతోపాటు దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్, మధుమేహం వంటివి పెరుగుతున్నాయన్నాయని తెలిపారు. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే ఉద్యోగాలు, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, తీవ్రమైన పనిఒత్తిడి, ధూమపానం, పొగాకు నమలడం వంటి సమస్యలే అసంక్రమిత వ్యాధులకు కారణమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య అవసరాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రైవేట్ సంస్థలు సైతం చొరవ తీసుకుని సహకారం అందించాలని సూచించిన ఆయన, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా మంచి వైద్యం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం ఆర్థికంగా అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.
ప్రతి వెయ్యిమందికి ఒక వైద్యుడు ఉండాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) నిబంధనను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, భారతదేశంలో ఈ నిష్పత్తి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించడంలోనూ ప్రైవేటు రంగం ముందుకురావాలని.. అందుబాటు ధరల్లో వైద్యవిద్యను అందించడంపై దృష్టిసారించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఫర్ కరోనరీ సర్జన్స్ అధ్యక్షుడు డాక్టర్ సజ్జా లోకేశ్వరరావు, కార్యదర్శి డాక్టర్ మన్నెం గోపీచంద్, ప్రెసిడెంట్ (ఎలక్ట్) డాక్టర్ కునాల్ సర్కార్, సొసైటీ ఆఫ్ థొరాసిక్ సర్జన్స్ (అమెరికా) అధ్యక్షుడు ప్రొఫెసర్ జోసెఫ్ డీరాని, సొసైటీ ఫర్ కరోనరీ సర్జన్స్ సహ కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ పద్మనాభన్తోపాటు సొసైటీలో సభ్యులుగా ఉన్న వైద్యులు, ఇతర ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- మరో నాలుగు రోజులు..
- గ్రామాల అభివృద్ధేప్రభుత్వ ధ్యేయం
- ‘పట్టభద్రుల’ ఓటర్లు 4,91,396
- నేటి నుంచి నిరంతరాయంగా..
- ఆకాశం హద్దుగా!
- పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
- కోడేరు అభివృద్ధ్దికి కంకణం కట్టుకున్నా
- ప్రభుత్వభూమి ఆక్రమణపై హైకోర్టును ఆశ్రయిస్తాం
- కాళేశ్వరంలో మళ్లీ జలసవ్వడి
- నల్లమల ఖ్యాతి నలుదిశలా విస్తరించాలి