శనివారం 16 జనవరి 2021
National - Jan 06, 2021 , 01:58:17

కుట్రతోనే టవర్ల విధ్వంసం

కుట్రతోనే టవర్ల విధ్వంసం

  • మాతో పోటీపడలేని వారి దొంగాట
  • వారికి స్వార్థశక్తుల తోడు
  • రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆరోపణ
  • చైనా సామగ్రిని ఉపయోగించని ఏకైక కంపెనీ తామదేనని వెల్లడి

న్యూఢిల్లీ, జనవరి 5: రైతుల నిరసన పేరిట పంజాబ్‌లో తమ జియో నెట్‌వర్క్‌ టెలికం టవర్లను ధ్వంసం చేయటం వెనుక కొందరి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆరోపించింది. ఈ విధ్వంసం... స్వార్థ శక్తుల కుట్ర అని ఆరోపిం చింది. చైనా సామగ్రిని ఉపయోగించని ఏకైక టెలికం కంపెనీ జియో మాత్రమేనని, తమ పోటీదారులు మాత్రం ఎక్కువగా చైనా ఉపకరణాలనే వాడుతున్నారని తెలిపింది. ‘ఈ పరిస్థితి మారకూడదని వారు కోరుకుంటున్నారు. అందుకే మా విధానాన్ని బలహీనపరచడానికి విదేశీ, రాజకీయ స్వార్థ శక్తులతో చేతులు కలుపుతున్నార’ని ఆరోపించింది. భారత్‌కు సొంత 5జీ టెక్నాలజీని జియో అభివృద్ధి చేసిందని, దీన్ని కూడా ఆ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని పేర్కొంది. బహుళజాతి సంస్థలు నియంత్రిస్తున్న చాలామంది జియో పోటీదారులు తమతో పోటీ పడలేక దొంగాట ఆడుతున్నారని విమర్శించింది. ‘2016లో జియో తన సర్వీసులను ప్రారంభించి, వారి నెట్‌వర్క్‌కు ఇంటర్‌కనెక్ట్‌ను నిరాకరించినప్పుడు కూడా ఆ కంపెనీలు ఇదే తరహా దొంగాటలాడాయి. ఆ కంపెనీలపై ట్రాయ్‌, టెలికం శాఖలు రూ.3,000 కోట్లు జరిమానా విధించాయి. కారణమేంటో తెలియదు కానీ ఆ జరిమానాల వసూలుకు టెలికం శాఖ చర్యలు తీసుకోవడం లేద’ని ఆరోపించింది. బహుళజాతి రిటైల్‌ సంస్థల దెబ్బకు చిన్న వ్యాపారులు చితికిపోకుండా వారికి మద్దతు ఇస్తున్నది రిలయన్స్‌ రిటైల్‌ ఒక్కటేనని పేర్కొంది. ఆ బహుళజాతి సం స్థలు రిలయన్స్‌ రిటైల్‌ను దెబ్బతీసి, ఆపై తమ ధనబలంతో భారత్‌లోని చిన్న వ్యాపారులను నాశనం చేయాలని చూస్తున్నాయని ఆరోపించింది. మరోవైపు, రిలయన్స్‌ జియో ఇన్ఫోకాం లిమిటెడ్‌కు చెం దిన టెలికం టవర్ల విధ్వంసానికి సంబంధించి పం జాబ్‌ సర్కార్‌, కేంద్ర ప్రభుత్వానికి  పంజాబ్‌-హర్యానా హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది.