మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 02:12:01

కంపెనీల నిఘా

కంపెనీల నిఘా

  • వెలుగులోకి వచ్చిన చైనా కొత్త వ్యవహారం 
  • దేశంలో పలురంగాల్లో ఆ దేశ కంపెనీలు 
  • చైనా సైన్యంతో ఈ సంస్థలకు సంబంధాలు 
  • సమాచారం చేరవేత..గుర్తించిన కేంద్రం 

న్యూఢిల్లీ: చైనా కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తమ దేశానికి చెందిన కంపెనీల ద్వారా భారత్‌పై డ్రాగన్‌ నిఘా వేసినట్లు వెల్లడైంది. చైనా సైన్యం ‘పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ’ (పీఎల్‌ఏ)తో సంబంధాలు కలిగి ఉండి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న పలు చైనా కంపెనీలను భారత ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఇందులో హువావేతోపాటు సీఈటీసీ, జిందియా స్టీల్స్‌ వంటి కంపెనీలు ఉన్నాయి. భారత్‌లో ఇవి నిఘా చర్యలకు పాల్పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఇప్పటికే.. దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నాయనే కారణంతో ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ సహా చైనాకు చెందిన 59 మొబైల్‌ అప్లికేషన్లపై కేంద్రం ఇటీవలే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన కంపెనీలు, సంస్థలపై కేంద్రం కొనసాగిస్తున్న పరిశీలనలో తాజా సంగతి బయటకొచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ కంపెనీలు..

జిన్‌జింగ్‌ క్యాథాయ్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌

సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో ఈ కంపెనీ చత్తీస్‌గఢ్‌లో మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటుచేసింది. చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఈ కంపెనీని ఆహ్వానించింది. రాష్ట్రంలో ముడి ఇనుమును పరిశీలించేందుకు ఈ కంపెనీ ఒక బృందాన్ని పంపనుంది. దాదాపు రూ.3000 టర్నోవర్‌ కలిగిన ఈ కంపెనీ.. ఇప్పటికే 30,000 టన్నుల ఐరన్‌ పైపులను భారత్‌కు సరఫరా చేసింది.

చైనా ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ గ్రూప్‌ కార్పొరేషన్‌ (సీఈటీసీ)

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో 200ఎంవీ పీవీ మాన్యుఫ్యాక్చరింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు రూ.320 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు 2018లో ఈ కంపెనీ ప్రకటించింది. చైనాలో ప్రధాన మిలిటరీ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీల్లో ఇదొకటి. హిక్‌విజన్‌ సీసీటీవీ కెమెరాలను కూడా ఇది ఉత్పత్తి చేస్తుంది. భద్రతా కారణాలతో సీఈటీసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌, అనుబంధ సంస్థలను అమెరికా ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉంచింది. అక్రమ ఎగుమతులకు సంబంధించి కంపెనీపై అమెరికాలో మూడు కేసులు నమోదయ్యాయి. గూఢచర్యానికి పాల్పడుతూ కంపెనీకి చెందిన పలువురు ఉద్యోగులు దోషులుగా కూడా తేలారు.

హువావే

పీఎల్‌ఏ ఇంజనీరింగ్‌ కాప్స్‌ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ అయిన రెన్‌ జెంగ్‌ఫీ 1987లో షెన్‌జెన్‌లో హువావే కంపెనీని స్థాపించారు. ఇండియాలోనూ హువావే పాపులర్‌ బ్రాండ్‌. 2018-19లో ఈ కంపెనీ ఇండియాలో రూ.12,800 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. స్మార్ట్‌ఫోన్ల తయారీ, మొబైల్‌ కమ్యూనికేషన్స్‌ ఈ కంపెనీ ప్రధాన వ్యాపారం.

జిందియా స్టీల్స్‌ లిమిటెడ్‌

భారత్‌, చైనా మధ్య అతిపెద్ద జాయింట్‌ వెంచర్‌ కంపెనీల్లో ఇదొకటి. సుమారు 250 కోట్ల వ్యయంతో ఈ కంపెనీ ఇటీవలే కర్ణాటకలోని కొప్పాల్‌ జిల్లాలో ఐరన్‌ ఓర్‌ పెల్లెటైజేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. చైనాకు చెందిన జిన్‌జింగ్‌ క్యాథాయ్‌ ఇంటర్నేషనల్‌ గ్రూప్‌ కో లిమిటెడ్‌ ఇందులో ప్రధాన వాటాదారు. పీఎల్‌ఏకు చెందిన జనరల్‌ లాజిస్టిక్స్‌ విభాగానికి సంబంధించిన సబార్డినేట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ నుంచి దీన్ని వేరుచేసి పునర్యస్థీకరించారు.

విదేశాల్లో నిఘా.. ప్రతి సంస్థ విధి!

2017 జూన్‌లో చైనా ఇంటెలిజెన్స్‌ చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం హువావే, జెట్‌టీఈ, టిక్‌టాక్‌ వంటి కంపెనీలు తాము పనిచేస్తున్న దేశాల్లో చైనా జాతీయ నిఘా సంస్థలకు సహకారం, మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. చట్టంలోని ఆర్టికల్‌ 7 ప్రకారం.. ‘ఏ సంస్థ అయినా లేదా పౌరుడు అయినా చట్టాన్ని అనుసరించి దేశ నిఘా కార్యకలాపాలకు మద్దతు, సహకారం, తోడ్పాటు అందించాలి. సహకారం అందించే ఆయా సంస్థలు, పౌరులకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది’ అని పేర్కొన్నారు.


logo