బుధవారం 02 డిసెంబర్ 2020
National - Oct 22, 2020 , 17:29:06

'ఎక్క‌డ ఎన్నిక‌లు ఉంటే అక్క‌డ వ్యాక్సిన్ పంపిణీ'

'ఎక్క‌డ ఎన్నిక‌లు ఉంటే అక్క‌డ వ్యాక్సిన్ పంపిణీ'

ఢిల్లీ : మీకు కొవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుందో తెలుసుకోవాలంటే రాష్ర్టాల వారిగా ఎన్నిక‌ల షెడ్యూల్‌ను రిఫ‌ర్ చేయాల్సిందిగా కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ తెలిపారు. బిహార్‌లో ఉచిత కొవిడ్‌-19 వ్యాక్సిన్ ఇస్తామ‌న్న బీజేపీ ప్ర‌చార వాగ్దానాన్ని రాహుల్ తీవ్రంగా విమ‌ర్శించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామన్ గురువారం బీజేపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను విడుద‌ల చేశారు. కోవిడ్ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి ప్రారంభ‌మైన త‌ర్వాత బీహార్‌లో ప్ర‌తి ఒక పౌరుడికి ఉచితంగా ఆ టీకా ఇవ్వ‌నున్న‌ట్లు ఈ సంద‌ర్భంగా ఆమె తెలిపారు. పార్టీ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో తాము చేస్తున్న తొలి వాగ్ధానం ఇదే అని మంత్రి పేర్కొన్నారు.

దీనిపై రాహుల్ గాంధీ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. అధికార పార్టీ ప్ర‌జ‌ల ప్రాణాల‌ను ర‌క్షించే మందును ఎన్నిక‌ల‌తో ముడిపెట్టింద‌న్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్రపంచం ప‌రుగెడుతుంద‌న్నారు. భారత్‌తో సహా అనేక దేశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. కాగా ప‌రిశోధ‌న‌లో ఉన్న టీకాను ఎన్నికల వాగ్దానంలో చేర్చ‌డం ఇదే మొదటిసార‌న్నారు. మ‌రి బీజేపీయేత‌ర రాష్ర్టాల ప‌రిస్థితి ఏంటి? బీజేపీకి ఓటు వేయ‌నివాళ్ళ‌కు వ్యాక్సిన్ అంద‌దా అని రాహుల్ గాంధీ ప్ర‌శ్నించారు.