శుక్రవారం 05 జూన్ 2020
National - Feb 02, 2020 , 07:58:18

ఐటీ తిరకాసు

ఐటీ తిరకాసు
  • కొత్తదా! పాతదా?
  • షరతులతో ఆదాయం పన్నురేట్ల తగ్గింపు
  • మినహాయింపులు వదులుకొంటేనే లబ్ధి
  • కేంద్ర బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ స్పష్టీకరణ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆదాయం పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం తిరకాసు పెట్టింది. మధ్యతరగతి ప్రజలతోపాటు, ఎగువ మధ్యతరగతి ప్రజలకు లబ్ధిచేకూరేలా పన్నులను సరళీకరిస్తున్నట్టు సార్వత్రిక బడ్జెట్‌ 2020-21లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. రూ.15 లక్షలలోపు వార్షికాదాయాన్ని కలిగి ఉండి మినహాయింపులను, రాయితీలను వదులుకొనేవారికి కొత్త పన్ను శ్లాబులను ప్రవేశపెట్టింది. ఈ శ్లాబుల ద్వారా లబ్ధి పొందేందుకు కొన్ని షరతులు విధిస్తూ నూతన పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. 

ఈ విధానాన్ని ఎంచుకొనేవారు కొన్ని రాయితీలను, మినహాయింపులను వదులుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త ఆదాయం పన్ను విధానం ఐచ్ఛికమని ప్రకటించింది. మినహాయింపులు, రాయితీలతో కూడిన పాత ఆదాయం పన్ను విధానంలోనే కొనసాగాలా? లేక కొత్త విధానంలోకి మారాలా? అన్నది పన్నుచెల్లింపుదారుల ఇష్టమేనని, అయితే ఓసారి కొత్త విధానంలోకి మారితే తర్వాతి సంవత్సరాల్లో కూడా అదే విధానంలో కొనసాగాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ స్పష్టం చేశారు.

 వార్షికాదాయం రూ.5 లక్షలలోపు ఉన్నవారు పాత విధానంలోగానీ, కొత్త విధానంలో గానీ ఎలాంటి పన్ను చెల్లించనక్కరలేదని ప్రకటించారు. ‘వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించడంతోపాటు ఆదాయం పన్ను చట్టాన్ని సరళీకరించేందుకు కొత్త ఆదాయం పన్ను విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదిస్తున్నా. కొన్ని మినహాయింపులు వదులుకొనేవారికి కొత్త విధానంలో ఆదాయం పన్నురేట్లు గణనీయంగా తగ్గుతాయి’ అని తెలిపారు. కొత్త పన్ను ప్రతిపాదన ప్రకారం.. వార్షికాదాయం రూ.2.5 లక్షలలోపు ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరంలేదని, రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవారు గతంలో మాదిరిగా 5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుందని వివరించారు. 


వార్షికాదాయం రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు ఉన్నవారికి పన్నురేటును 10 శాతానికి, రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షలలోపు ఆదాయమున్నవారు చెల్లించే పన్నును 15 శాతానికి, రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షలలోపు ఆదాయమున్నవారికి పన్నురేటును 20 శాతానికి, రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయమున్నవారు చెల్లించే పన్నును 25 శాతానికి తగ్గిస్తున్నామని, రూ.15 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్నవారు 30 శాతం పన్ను చెల్లించాలని నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన వల్ల ప్రభుత్వానికి సాలీనా రూ.40 వేలకోట్ల ఆదాయం తగ్గుతుందని తెలిపారు. ఆదాయం పన్నులో ప్రస్తుతం దాదాపు 100 వరకు రాయితీలు, మినహాయింపులు ఉన్నాయని, సరళీకృత కొత్త పన్ను విధానంలో 70 రాయితీలు, మినహాయింపులను తొలిగించామని, మిగిలినవాటిపై తర్వాత పరిశీలన జరుపుతామని పేర్కొన్నారు. 


వార్షికాదాయం రూ.15 లక్షలలోపు ఉంటే

పన్ను భారం రూ.78 వేల తగ్గుదల

కొత్త విధానంలో పన్నుచెల్లింపుదారులకు గణనీయ లబ్ధి చేకూరుతుందని, ఇది వారు క్లెయిమ్‌చేసే మినహాయింపులు, రాయితీలపై ఆధారపడి ఉంటుందని నిర్మ లా సీతారామన్‌ తెలిపారు. ఉదాహరణకు రూ.15 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న ఓ వ్యక్తి మినహాయింపులు పొందకపోతే పాత విధానంలో రూ.2.73 లక్షల పన్ను చెల్లించాల్సివచ్చేదని, కొత్త విధానంలో ఆ వ్యక్తి రూ.1.95 లక్షల పన్ను చెల్లిస్తే సరిపోతుందని, అతనిపై పన్ను భారం రూ.78 వేలు తగ్గుతుందని చెప్పారు. ఆదాయం పన్ను చట్టం (దీనిలో బీమా ప్రీమియం, భవిష్యనిధి చందా, కొన్ని పెన్షన్‌ ఫండ్లు ఉంటాయి)లోని ఆర్టికల్‌ 80 కింద తొలిగించాలని ప్రతిపాదించిన కొన్ని మినహాయింపుల్లో స్టాండర్డ్‌ డిడక్షన్‌, ఇంటి అద్దె అలవెన్సు తదితరాలు ఉన్నట్టు పేర్కొన్నారు.


కొత్త శ్లాబులు ఇవే..

వార్షికాదాయం
ప్రస్తుత పన్నురేటు
కొత్త పన్నురేటు
0 నుంచి రూ.2.5 లక్షలు
0%
  0%
రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షలు
5%
  5%
రూ5 లక్షల నుంచి రూ.7.5 లక్షలు
20%
10%
రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షలు
20%
15%
రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షలు
30%
20%
రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షలు
30%
25%
రూ.15 లక్షల కంటే ఎక్కువ
30%
30%


కొత్త విధానాన్ని ఎంచుకొంటే.. పలు పన్ను రాయితీలు కట్‌

భవిష్యత్‌లో అన్ని మినహాయింపులు ఎత్తివేత

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆదాయం పన్ను చెల్లింపుల కోసం కొత్త శ్లాబులు, రేట్లను ఎంచుకొనేవారు రూ.50 వేల స్టాండర్డ్‌ డిడక్షన్‌ సహా పిల్లల ట్యూషన్‌ ఫీజు, బీమా ప్రీమియం, ప్రావిడెండ్‌ ఫండ్‌, కొన్ని రకాల షేర్లు తదితరాలపై పొందే పలురాయితీలను, మినహాయింపుల ను వదులుకోవాల్సి ఉంటుంది. ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్‌ కింద పన్ను రాయితీ పొందే హక్కు వీరికి ఉండదు. సెక్షన్‌ 80సీసీసీ (కొన్ని రకాల పెన్షన్‌ ఫండ్‌లకు చెల్లించే చందాలు), సెక్షన్‌ 80 డీ (ఆరోగ్య బీమా), 80ఈ (ఉన్నత విద్యకు పొందిన రుణానికి చెల్లించే వడ్డీ), 80ఈఈ (ఇంటికోసం తీసుకున్న రుణంపై చెల్లించే వడ్డీ), 80ఈఈబీ (విద్యుత్‌తో నడిచే వాహ నం కొనుగోలు), 80జీ (సేవా సంస్థలకు ఇచ్చే విరాళాలు), 80జీజీ (అద్దె చెల్లింపు)పై పన్ను మినహాయింపులతోపాటు ఎల్టీసీ (లీవ్‌ ట్రావె ల్‌ కన్సెషన్‌), మైనర్ల ఆదాయానికి సంబంధించిన అలవెన్సులు, ఎంపీలు/ఎమ్మెల్యేలకు ఇచ్చే కొన్ని రకాల అలవెన్సులు, ఓచర్ల ద్వారా ఉద్యోగులకు ఉచితంగా అందించే ఆహారం, పానీయాలపై ఇచ్చే పన్ను రాయితీలను వదులుకోవాల్సి ఉంటుంది. విధుల నిర్వహణ కో సం ఉద్యోగులకు ఇచ్చే కన్వేయన్స్‌ అలవెన్సు, ట్రావెల్‌ అలవెన్సు, టూర్‌ అలవెన్సు సహా కొన్నిరకాల భత్యాలపై ఇచ్చే పన్ను మినహాయింపులు కొత్త విధానంలోనూ కొనసాగుతా యి. భవిష్యత్‌లో అన్ని ఐటీపన్ను మినహాయింపులను తొలిగించాలని కేంద్రం భావిస్తున్నదని మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. శనివారం బడ్జెట్‌ ప్రవేశపెట్టాక ఢిల్లీలో మీడి యాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.


logo