సోమవారం 26 అక్టోబర్ 2020
National - Aug 25, 2020 , 18:30:23

జీఎస్టీతో ప్రజలపై తగ్గిన పన్నుల భారం

జీఎస్టీతో ప్రజలపై తగ్గిన పన్నుల భారం

ఢిల్లీ : వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వ్యవస్థను ప్రవేశపెట్టడంతో పన్ను భారం తగ్గిందని, దీంతో సరళతర పన్ను వ్యవస్థలో పన్నులు చెల్లించే వారి సంఖ్య దాదాపు రెట్టింపై 1.24 కోట్లకు పెరిగిందని ఆర్థికమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మొదటి వర్ధంతి సందర్భంగా ఆర్థిక శాఖ ట్వీట్స్ చేసింది. అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పన్నుల భారం తొలగిందని పేర్కొన్నారు. 1 జూలై 2017 అర్ధరాత్రి ఓ అద్భుతం ఆవిష్కృతమైందని, దేశమంతా ఒకటే విపణిగా అవతరించిందని, రాష్ట్రాల మధ్య సరిహద్దులు చెరిగిపోయాయని, పలు రకాల పన్నులు ఒకటే పన్నుగా మారాయని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు.

పన్నులపై పన్ను భారం తొలగిందన్నారు. దాదాపు 17 రకాల స్థానిక లెవీలు, 13 సెస్‌ల ఉపసంహరణలతో మూడేండ్ల క్రితం జీఎస్టీ వ్యవస్థ ప్రారంభమైనప్పుడు జైట్లీ ఆర్థిక శాఖమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం 480 వరకు ఉత్పత్తులపై సున్నాలేదా 5 శాతం పన్ను ఉంది. 221 ఉత్పత్తులపై 12 శాతం, 607 వస్తువులపై 18 శాతం జీఎస్టీ ఉంది. 28 శాతం జీఎస్టీ స్లాబ్‌లో ప్రస్తుతం కేవలం 29 ఉత్పత్తులు మాత్రమే ఉన్నాయి. పన్ను రేటు తగ్గింపు వల్ల ప్రభుత్వం ఏడాదికి రూ.1 లక్ష కోట్ల వరకు ఆదాయం రూపంలో నష్టపోతున్నట్లు తెలిపింది. జీఎస్టీకి ముందు అమలులో ఉన్న బహుళ పరోక్ష పన్నుల వ్యవస్థ(వ్యాట్), ఎక్సైజ్, అమ్మకపు పన్ను వాటికి సంబంధించిన ఇతర చార్జీలవల్ల దేశ ప్రజలపై అధిక పన్ను భారం ఉండేది. 31 శాతం వరకు ఉన్న అధికస్థాయి పన్ను రేటు ధరలపై ప్రభావం చూపేది.

జీఎస్టీ తర్వాత ఎక్కువ వస్తువులపై సున్నా, తక్కువ వస్తువులపై 28 శాతం జీఎస్టీ ఉంది. జీఎస్టీ విధానం అటు వినియోగదారుకు అటు పన్ను చెల్లింపుదారుకు స్నేహపూర్వకంగా ఉంది. జీఎస్టీకి ముందు ఎక్కువ పన్నుభారం కారణంగా ఈ చట్రంలోకి రావడానికి వెనుకడుగు వేసే పరిస్థితి ఉండగా, ఇప్పుడు పన్నుభారం తగ్గి, పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా పెరిగింది. జీఎస్టీ ప్రారంభంలో అసెస్‌ల సంఖ్య 65 లక్షలు కాగా, ఇప్పుడు దాదాపు రెట్టింపై 1.24 కోట్లుగా ఉంది. జీఎస్టీ అమల్లో జైట్లీ పాత్ర కీలకం. ఇది చారిత్రాత్మక సంస్కరణ. ప్రజలు పన్నులు చెల్లించే స్థాయికి జీఎస్టీ తగ్గించింది. అప్పుడు న్యూట్రల్ రేటు 15.3 శాతం కాగా, ఇప్పుడు 11.6 శాతంగా ఉంది.


 


logo