బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 14:43:16

అన్ని పనులూ పోలీసుల మీదనే రుద్దితే ఎలా?

అన్ని పనులూ పోలీసుల మీదనే రుద్దితే ఎలా?

ముంబై: కరోనా కష్టకాలంలో అయిందానికి, కానిదానికీ పోలీసులనే నియోగించాల్సిన అవసరం లేదని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. కొన్ని పనులకు రెవెన్యూ సిబ్బందిని నియమించవచ్చని సూచించింది. వైద్య, ప్యారామెడికల్ సిబ్బంది, పోలీసుల సమస్యలపై చేపట్టిన ఐచ్ఛిక పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఆర్వీ ఘూగే మహారాష్ట్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు తీవ్రమైన వత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు. వీధులు, రైల్వేస్టేషన్లు, కాలనీలు ఇలా ఏ పనికైనా పోలీసులనే నియోగిస్తున్నారని, చివరికి రవాణా పాసుల పని, ఇతర చిన్నాచితకా పనులు కూడా వారికే అంటగట్టారని గుర్తుచేశారు. రెవెన్యూ విభాగంలోని అనేకమంది అధికారులు, ఉద్యోగులు విధుల్లో లేరనే సంగతి స్థానిక విభాగాలకు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసనే భావిస్తున్నానని న్యాయమూర్తి అన్నారు. రెవెన్యూ ఉద్యోగులను, ముఖ్యంగా 50 ఏళ్లలోపు వారిని ప్రత్యేకించి పోలీసుల అవసరం లేని విధులకు నియోగించవచ్చని సూచించారు. వలస కార్మికులు, ఉపాధి కోల్పోయినవారు తమ సొంతూళ్లకు వెళ్లాలని అనుకుంటే వారి నమోదు బాధ్యతలను రెవెన్యూ సిబ్బందికి అప్పగించి పోలీసుల మీద భారం తగ్గించవచ్చని న్యాయమూర్తి ఘూగే తెలిపారు. ఔరంగాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే ఓ నర్సు వేధిపులకు గురికావడాన్ని ప్రస్తావిస్తూ వైద్యసిబ్బందికి తగిన రక్షణ కల్పించాలని ఆదేశించారు. వేదింపులకు, దాడులకు పాల్పడేవారిపై పోలీసులు చట్టం ప్రకారం కేసులు పెట్టాలని ఆదేశించారు.  


logo