బుధవారం 21 అక్టోబర్ 2020
National - Aug 24, 2020 , 16:06:20

రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలపై రెడ్ వార్నింగ్

రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలపై రెడ్ వార్నింగ్

న్యూఢిల్లీ: రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలపై భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రెడ్ వార్నింగ్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్, గుజరాత్ లోని పోర్‌బందర్, కాండ్ల ప్రాంతాల్లో ఆదివారం అత్యధిక వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది. దక్షిణ రాజస్థాన్ ప్రాంతాల్లో నెలకొన్న అల్పపీడనం మరో రెండు రోజుల్లో పశ్చిమదిశగా కదులుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో దక్షిణ రాజస్థాన్, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

కాగా ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది మరింతగా బలపడితే తూర్పు, మధ్య భారత్ ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ నెల 24 నుంచి 26 వరకు ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అరేబియా సముద్రం నుండి దక్షిణ-పడమర దిశగా వీచే గాలులు తోడవుతాయని, దీంతో వాయువ్య భారతదేశంలోని జమ్ముకశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఈ నెల 25 నుంచి 28 వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో కూడా దీని ప్రభావం ఉంటుందని, ఈ నెల 26, 27 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మొత్తం మీద ఈశాన్య రుతుపవనాల వల్ల ఈ ఏడాది జూన్ 1 నుంచి దేశవ్యాప్తంగా 7 శాతం మేర అధిక వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo