ఆదివారం 05 జూలై 2020
National - Jun 22, 2020 , 01:49:14

24 గంటల్లో 15,413 కేసులు

24 గంటల్లో 15,413 కేసులు

  • 4,10,461కు చేరిన కరోనా బాధితులు
  • మృతులు 13,254
  • దేశంలో ప్రమాదకర వేగంతో విస్తరణ

న్యూఢిల్లీ, జూన్‌ 21: కరోనా మహమ్మారి దేశంలో ఎక్స్‌ప్రెస్‌ వేగంతో వ్యాపిస్తున్నది. ప్రతిరోజూ కొత్త కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కేవలం 8 రోజుల్లోనే కేసులు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలకు చేరుకున్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా 15,413 కొత్త పాజిటివ్‌ కేసులు రికార్డు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,10,461కి చేరింది.  తాజాగా 306 మంది మరణించడంతో మృతుల సంఖ్య 13,254కు చేరుకున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ , ఢిల్లీలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో కరోనా కట్టడికి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలుచేశారు. 

క్వారంటైన్‌కు 9 అంతస్తుల భవనం ఇచ్చేశాడు

ముంబైలోని ‘షీజీ శరణ్‌ డెవలపర్స్‌' అధినేత మొహుల్‌ సింఘ్వీ కొత్తగా నిర్మించిన 19 అంతస్థుల భవనాన్ని ‘క్వారంటైన్‌' కేంద్రంగా వాడుకునేందుకు అధికారులకు అప్పగించారు. ఈ భవనంలో ఫ్లాట్లు కొన్న కుటుంబాలు కూడా అందుకు సమ్మతించాయి. నలుగురు రోగులతోపాటు 300 మంది కరోనా అనుమానితులు చేరారు.

కరోనా కాదది ‘కుంగ్‌ ఫ్లూ’: ట్రంప్‌

వాషింగ్టన్‌: చైనా ప్రపంచంపైకి ‘కుంగ్‌ ఫ్లూ (కరోనా)’ వదిలిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపించారు. శనివారం ఒక్లాహోమాలోని తుల్సలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ చైనా వదిలిన కుంగ్‌ ఫ్లూ వల్ల 4.50 లక్షల మందికి పైగా మరణించారని అన్నారు. ‘చరిత్రలో ఏ వ్యాధికి లేనన్ని పేర్లు కొవిడ్‌-19కు ఉన్నాయి. దానికి కుంగ్‌ ఫ్లూ అని పేరు పెడుతున్నా. 19 విభిన్న వర్షన్లతో పేర్లు నేను పెట్టగలను అని అన్నారు. 

చైనాలో కరోనా 37 రెట్లు!

చైనా జనవరిలో ప్రకటించినదానికంటే కరోనా కేసులు ఆ దేశంలో 37 రెట్లు నమోదయ్యాయని అమెరికా అధ్యయన సంస్థ ‘రాండ్‌' తెలిపింది. జనవరి 22న చైనా ప్రకటించిన 503 కేసులు వాస్తవం కాదని, ఆ నాటికే 18,700 కేసులు రికార్డయి ఉంటాయని అంచనా వేసింది. కరోనా వెలుగు చూశాక ఆ దేశం నుంచి వెళ్లిన విమాన ప్రయాణికుల సంఖ్యను బట్టి ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. గతేడాది డిసెంబర్‌ 31 నుంచి జనవరి 22 వరకు చైనాలో సగటున ప్రతిరోజూ 172 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నది. ఈ 23 రోజుల్లో జపాన్‌, థాయిలాండ్‌, దక్షిణ కొరియా, అమెరికా, తైవాన్‌లకు 37 లక్షల మంది ప్రయాణించారని, వారంతా కరోనాను ఆయా దేశాలకు దిగుమతి చేశారని తెలిపింది.


logo