గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 18:49:55

అసత్యాలను గుర్తించి దూరంగా ఉండండి: వెంకయ్యనాయుడు

అసత్యాలను గుర్తించి దూరంగా ఉండండి: వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల ప్రభావం పెరిగిన నేపథ్యంలో.. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే మంచి, చెడులను బేరీజు వేసుకునే సామర్థ్యాన్ని పెంపొందింపజేయాలని ఉపరాష్ట్రపతి  వెంకయ్యనాయుడు చెప్పారు. సోమవారం ఉపరాష్ట్రపతి భవన్‌ నుంచి ఆన్‌లైన్లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ‘టైమ్స్ స్కాలర్స్ ఈవెంట్’ను ఉద్దేశించి వెంకయ్య ప్రసంగించారు. వాస్తవాలను తెలుసుకుని దాన్ని అలవర్చుకోవాలని, అసత్యాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.

విద్యార్థుల్లో పఠనాసక్తి తగ్గిపోతుండటంపై ఉపరాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. పుసక్త పఠనం, వార్తాపత్రికల పఠనాన్ని దైనందిన జీవితంలో భాగంగా మార్చుకోవాలన్నారు. అపరిమిత సమాచారం అరచేతిలో అందుబాటులో ఉన్న ఈ పరిస్థితుల్లో జాగరూకతతో వ్యవహరించడంతోపాటు నిరంతర అధ్యయనం చేయడం, పుస్తకాలు చదవడంపై విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ‘కలలు కనండి. వాటి సాకారానికి కృషిచేయండి’ అన్న అబ్దుల్ కలాం మాటలను గుర్తుచేస్తూ.. కలలను సాకారం చేసుకునేందుకు క్రమశిక్షణ, కఠోరమైన శ్రమ, చిత్తశుద్ధి, పట్టుదలతోపాటుగా దృఢసంకల్పంతో ముందుకెళ్లాలన్నారు. కరోనా నేపథ్యంలో వ్యాధినిరోధకతను పెంచుకోవడంతోపాటు ఏకాగ్రత, క్రమశిక్షణ పెంచుకునేందుకు యోగాసాధన ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

విద్యను ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సాధనంగా మాత్రమే భావించవద్దని.. జ్ఞానాన్ని పెంపొందించుకుని సాధికారత సాధించేందుకు వినియోగించుకోవాలన్నారు. భారతీయ సంస్కృతి, వారసత్వ సంపద, ఘనమైన చరిత్రను నేటి యువత తెలుసుకోవాలని సూచించారు. సాధించిన దానితో సంతృప్తి చెందకుండా.. మరింత ఉన్నతస్థితిని చేరుకునే లక్ష్యంతో కృషిచేయాలన్నారు. నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న పేదరికం, అసమానతలు, హింస, వాతావరణ మార్పులు తదితర అంశాలకు వినూత్న పరిష్కారాలకోసం కృషిచేయాలని యువతకు సూచించారు.


logo