గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 17:57:34

క‌ర్ణాట‌క‌కు రాజ‌స్థాన్ రెబెల్ ఎమ్మెల్యేలు

క‌ర్ణాట‌క‌కు రాజ‌స్థాన్ రెబెల్ ఎమ్మెల్యేలు

జైపూర్‌: హ‌ర్యానాలోని ఓ హోట‌ల్‌లో క్యాంప్ వేసిన రాజ‌స్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల‌ను అక్క‌డి నుంచి క‌ర్ణాట‌క‌కు త‌ర‌లించార‌ని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. స‌చిన్ పైల‌ట్ వ‌ర్గానికి చెందిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ముందుగా బీజేపీ పాలిత రాష్ట్ర‌మైన‌ హ‌ర్యానాలో క్యాంప్ వేశార‌ని, రాజ‌స్థాన్ పోలీసులు గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ ఆడియో టేపుల వ్య‌వ‌హారంలో వారిని ప్ర‌శ్నించేందుకు వెళ్లేస‌రికి.. వారిని అక్క‌డి నుంచి మ‌రో బీజేపీ పాలిత రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌క‌కు త‌ర‌లించార‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. 

రాజ‌స్థాన్‌లో ముఖ్య‌మంత్రి అశోక్‌గెహ్లాట్‌పై ఇటీవ‌ల ఉప‌ముఖ్య‌మంత్రి, యువ నాయ‌కుడు అయిన‌ స‌చిన్‌పైల‌ట్ తిరుగుబాటు చేశాడు. దీంతో గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం సంక్షోభం అంచున నిలిచింది. ఈ నేప‌థ్యంలో స‌చిన్‌పైల‌ట్ వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేల‌ను బీజేపీలోకి లాగేందుకు కేంద్ర‌మంత్రి గ‌జేంద్రసింగ్ షెకావ‌త్ ప్ర‌య‌త్నించార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. ఈ మేర‌కు గ‌జేంద్ర‌సింగ్‌, ఎమ్మెల్యేల మ‌ధ్య సంభాష‌ణ‌కు సంబంధించిన ఆడియోలు మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. స‌చిన్‌పైల‌ట్ శిబిరంలోని ఎమ్మెల్యేల‌ను ప్ర‌శ్నించేందుకు హ‌ర్యానాలో వారు క్యాంప్ వేసిన హోటల్‌కు శుక్ర‌వారం వెళ్లారు. అయితే అప్ప‌టికే స‌చిన్ వ‌ర్గం ఎమ్మెల్యేలు హోట‌ల్ ఖాళీచేశారు. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే స‌చిన్ వ‌ర్గం ఎమ్మెల్యేలు క్యాంప్ వేస్తున్నార‌ని, రాజ‌స్థాన్ పోలీసులు విచార‌ణ‌కు వెళ్ల‌డంతో మ‌రో బీజేపీ పాలిత రాష్ట్ర‌మైన క‌ర్ణాట‌కు వారిని త‌ర‌లించార‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.            ‌ 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo