మంగళవారం 20 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 14:38:15

కౌర్ రాజీనామాకు అస‌లు కార‌ణం ఏమిటి?

కౌర్ రాజీనామాకు అస‌లు కార‌ణం ఏమిటి?

హైద‌రాబాద్:  బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ కూట‌మిలో ఉన్న‌ట్టుండి అల‌జ‌డి చెల‌రేగింది. కూటమిలో చిర‌కాల మిత్ర‌ప‌క్షంగా కొన‌సాగుతున్న‌ శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) బీజేపీకి షాకిచ్చింది. ఆ పార్టీ‌ ఎంపీ హర్‌ సిమ్రత్‌కౌర్‌ బాదల్‌ కేంద్రమంత్రి వర్గం నుంచి వైదొలగడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వ్య‌వసాయానికి సంబంధించి పార్లమెంటులో రైతు వ్య‌తిరేక బిల్లుల‌ను ప్ర‌వేశపెట్టింద‌ని, ఆ బిల్లుల‌ను వ్య‌తిరేకిస్తూ తాను రాజీనామా స‌మ‌ర్పించాన‌ని కౌర్ ప్ర‌క‌టించారు. 

అంత‌కుముందు పార్లమెంటులో ప్రసంగించిన హ‌ర్‌సిమ్ర‌త్ కౌర్‌ భర్త అకాలీదళ్‌ చీఫ్‌  సుఖ్బీర్‌ సింగ్ బాదల్‌ సైతం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. కౌర్‌, ఆమె భ‌ర్త సుఖ్బీర్ త‌మ నిర్ణ‌యానికి కార‌ణం రైతు వ్య‌తిరేక బిల్లుల‌ని పైకి చెబుతున్నా అస‌లు కార‌ణం అది కాద‌ని విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు. ఇది పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం ఎస్ఏడీ వేస్తున్న‌ రాజకీయ ఎత్తుగడ అని కాంగ్రెస్‌తోపాటు విపక్షాలు కూడా విశ్లేషిస్తున్నాయి. 

పంజాబ్‌లో రానున్న‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటేచేసే విష‌య‌మై గత కొంత కాలంగా బీజేపీ, ఎస్ఏడీ మ‌ధ్య‌ భేదాభిప్రాయాలు వస్తున్నాయని, అవి తాజాగా తారాస్థాయికి చేరాయని విశ్లేష‌కులు అభిప్రాయపడుతున్నారు. మరో 18 నెలల్లో పంజాబ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మ‌ధ్య సీట్ల పంపకాలపై ఇప్ప‌టికే చర్చలు ప్రారంభం అయ్యాయి. అయితే ఆ సంద‌ర్భంగా బీజేపీ త‌న‌కు గ‌తంలోలా కాకుండా 50-50 సీట్లు కావాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో వివాదం మొద‌లైన‌ట్లు తెలుస్తున్న‌ది.  

గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకుగాను బీజేపీ 23, ఎస్‌ఏడీ 94 స్థానాల్లో బరిలోకి దిగాయి. అయినా విజ‌యం కాంగ్రెస్ పార్టీని వ‌రించింది. ఈ క్రమంలో బాదల్‌ నాయకత్వంపై బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శలకు దిగారు. బాద‌ల్‌తో పొత్తు కారణంగానే రాష్ట్రంలో బీజేపీకి తీవ్ర నష్టం జరిగిందని, తమకున్న సాంప్రదాయ  ఓటు బ్యాంకును సైతం  కోల్పోవాల్సి వచ్చిందని వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల కోసం బీజేపీ నేత‌లు 50-50 ఫార్మాలాను ప్రతిపాదించింద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.‌ 

దీంతో స్థానిక బీజేపీ నేతల తీరు అకాలీదళ్‌ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. అదేవిధంగా వివాదాస్పద చట్టాలైన సీఏఏ, ఎన్‌ఆర్సీపై కూడా సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై పార్లమెంట్‌ వేదికగా నిరసన స్వరం వినిపించారు. కేంద్రంలో ఆ పార్టీకి ద‌క్కిన‌ ఏకైక కేంద్రమంత్రి ప‌ద‌విని కూడా వ‌దులుకున్నారు. 

ఇదిలావుంటే, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుండటం, తమ మద్దతుదారుల్లో అత్యధికులు రైతులే కావడంతో ఎస్ఏడీకి ఆ బిల్లులను వ్యతిరేకిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్ప‌డింద‌ని మ‌రికొంద‌రు విశ్లేష‌కులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రైతుల మెప్పు కోసమే రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారని కాంగ్రెస్‌ నేతలు విమ‌ర్శిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo