గురువారం 21 జనవరి 2021
National - Jan 02, 2021 , 01:13:34

ప్రతి పౌరుడికీ సొంతిల్లు

ప్రతి పౌరుడికీ సొంతిల్లు

  • ఆధునిక నిర్మాణ టెక్నాలజీతో పేదల కల సాకారం: మోదీ

న్యూఢిల్లీ, జనవరి 1: దేశంలో ప్రతి పౌరుడికీ సొంత ఇల్లు ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మోదీ అన్నారు. పేదలు, మధ్య తరగతి ప్రజలకు వేగంగా, నాణ్యమైన ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రపంచంలోని అత్యుత్తమ నిర్మాణ టెక్నాలజీలన్నింటినీ వినియోగించుకుంటామని చెప్పారు. నూతన టెక్నాలజీతో నిర్మించనున్న ‘లైట్‌ హౌజ్‌ ప్రాజెక్టు’(ఎల్‌హెచ్‌పీ)లకు ప్రధాని శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఇండోర్‌, రాజ్‌కోట్‌, చెన్నై, రాంచి, అగర్తల, లక్నోలలో ఫ్రాన్స్‌, జర్మనీ, అమెరికా, కెనడా టెక్నాలజీలతో వెయ్యి చొప్పున ఆధునిక ఇండ్లను ప్రయోగాత్మకంగా నిర్మించనున్నారు. గ్లోబల్‌ హౌజింగ్‌ టెక్నాలజీ చాలెంజ్‌ ఇండియా (జీహెచ్‌టీసీ- ఇండియా) ప్రాజెక్టులో భాగంగా వీటిని నిర్మిస్తారు. ‘ఆఫర్డబుల్‌ సైస్టెనబుల్‌ హౌజింగ్‌ యాక్సిలరేటర్స్‌-ఇండియా’ (ఆశా-ఇండియా) పథకంలో విజేతలను మోదీ ప్రకటించారు. 

సూర్యుడే స్ఫూర్తి

దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను స్వయంగా రాసిన కవితను ట్విట్టర్‌ ద్వారా పంచుకొన్నారు. అడ్డంకులను దాటుకొని విజయం సాధించడానికి సూర్యుడే స్ఫూర్తి అని సందేశమిచ్చారు. 

ఆరుచోట్లా భిన్న టెక్నాలజీలు..

ఎల్‌హెచ్‌పీ విధానంలో ఆరు రాష్ర్టాల్లో చేపట్టనున్న ఇండ్ల నిర్మాణంలో ఒక్కోచోట ఒక్కో టెక్నాలజీని వాడనున్నారు. ఇండోర్‌లో ఇటుకలు, సిమెంటు లేకుండా ముందుగానే తయారు చేసిన శాండ్‌విచ్‌ ప్యానల్స్‌తో ఇండ్లు నిర్మిస్తారు. రాజ్‌కోట్‌లో ఇండ్ల నిర్మాణంలో ఫ్రాన్స్‌లో వాడుతున్న మోనోలిథిక్‌ కాంక్రీట్‌ కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీని ఉపయోగిస్తారు. భూకంపాలు వరదలను తట్టుకొనేలా ఇందులో ఒకే కాంక్రీట్‌ దిమ్మతో ఇల్లు నిర్మిస్తారు. చెన్నైలో అమెరికా, ఫిన్‌లాండ్‌ టెక్నాలజీతో, రాంచిలో జర్మనీ టెక్నాలజీ సాయంతో త్రీడీ నమూనాలతో ఇండ్లు నిర్మిస్తారు. వేర్వేరుగా నిర్మించిన గదులను ఒకచోట చేరి ఇంటికి తుది రూపం ఇస్తారు. 


logo