శనివారం 30 మే 2020
National - Apr 18, 2020 , 03:20:43

సంక్షోభ సాయం లక్ష కోట్లు!

సంక్షోభ సాయం లక్ష కోట్లు!

 • ఆర్బీఐ తాజా ఉద్దీపనలు
 • బ్యాంకులకు రూ.50 వేల కోట్లు కేటాయింపు
 • ఎస్‌ఎంఈలకు రూ.50 వేల కోట్ల ప్యాకేజీ
 • రివర్స్‌ రెపోరేటు 3.75 శాతానికి కుదింపు
 • బ్యాంకుల డివిడెండ్ల చెల్లింపు నిలిపివేత
 • మొండి బకాయిల గుర్తింపు గడువు పెంపు

కరోనా వైరస్‌ కాటుతో కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మరోసారి రంగంలోకి దిగింది. ప్రస్తుత సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. బ్యాంకులతోపాటు చిన్న, మధ్యతరహా రుణ సంస్థల్లో నగదు లభ్యతను పెంచేందుకు శుక్రవారం తాజాగా రూ.లక్ష కోట్లతో తాజా ఉద్దీపనలతో ముందుకొచ్చింది. ఇందులో బ్యాంకులకు రూ.50 వేల కోట్లు, నాబార్డ్‌కు రూ.25 వేల కోట్లు, సిడ్బీకి రూ.15 వేల కోట్లు, నేషనల్‌ హౌసింగ్‌ బోర్డుకు రూ.10 వేల కోట్ల చొప్పున కేటాయించింది. వాణిజ్య బ్యాంకులు మరిన్ని రుణాలిచ్చేలా రివర్స్‌ రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన ఆర్బీఐ.. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకుల డివిడెండ్ల చెల్లింపులను నిలిపివేసింది. బ్యాంకుల లిక్విడిటీ కవరేజ్‌ రేషియో (ఎల్‌సీఆర్‌)ను 100 శాతం నుంచి 80 శాతానికి తగ్గించింది. మొండి బకాయిల గుర్తింపు కాలపరిమితిని 90 రోజుల నుంచి 180 రోజులకు పెంచింది.

ముంబై, ఏప్రిల్‌ 17: కరోనా వైరస్‌ కాటుతో కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మరోసారి పలు కీలక నిర్ణయాలను తీసుకొన్నది. కొవిడ్‌-19 కారుచీకట్ల నుంచి దేశాన్ని వెలుగుబాటలో నడిపేందుకు రూ.లక్ష కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో రెండో విడుత టార్గెటెడ్‌ లాంగ్‌ టర్మ్‌ రెపో లెండింగ్‌ ఆపరేషన్‌ (టీఎల్‌టీఆర్‌వో-2) ద్వారా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లకు రుణాలిచ్చేందుకు బ్యాంకులకు రూ.50 వేల కోట్ల రీఫైనాన్సింగ్‌ సదుపాయాన్ని కల్పించింది. చిన్న, మధ్యతరహా రుణ సంస్థ (ఎస్‌ఎంఈ)లకు మరో రూ.50 వేల కోట్లను కేటాయించింది. బ్యాంకులు మరిన్ని రుణాలిచ్చేలా రివర్స్‌ రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు (4 శాతం నుంచి 3.75 శాతానికి) తగ్గించడంతోపాటు రుణదాతల డివిడెండ్‌ చెల్లింపులను నిలుపుదల చేస్తున్నామని, మొండి బకాయిల నిబంధనలను సడలిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ద్రవ్యలభ్యతను పెంచుతామని, బ్యాంకులకు మరింత సహకారాన్ని అందజేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గత నెల 25న దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత ఆర్బీఐ ఉద్దీపనలను ప్రకటించడం ఇది రెండోసారి. 

రివర్స్‌ రెపోరేటు తగ్గింపు

దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు సరఫరాను క్రమబద్ధీకరించేందుకు రివర్స్‌ రెపోరేటును 4 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గిస్తున్నట్టు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. వాణిజ్య బ్యాంకులు తమ వద్ద అధిక మొత్తంలో నగదు ఉన్నప్పుడు దాన్ని రుణాలుగా రిజర్వు బ్యాంకుకు ఇస్తుంటాయి. ఈ రుణాలకు ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటునే రివర్స్‌ రెపోరేటు అంటారు. ప్రస్తుతం ఈ వడ్డీ రేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో వాణిజ్య బ్యాంకులు తమ వద్ద అధిక మొత్తంలో ఉన్న నగదును రిజర్వు బ్యాంకుకు ఇవ్వడానికి బదులుగా రిటైల్‌ రుణాలిచ్చేందుకు మొగ్గుచూపుతాయి. దీంతో రుణాలు ఆశించేవారికి త్వరగా అప్పు దొరకడంతోపాటు ఆర్థిక లావాదేవీలు పెరిగేందుకు ఆస్కారముంటుంది.

ఎల్‌సీఆర్‌ తగ్గింపు

బ్యాంకుల లిక్విడిటీ కవరేజ్‌ రేషియో (ఎల్‌సీఆర్‌)ను ఆర్బీఐ 100 శాతం నుంచి 80 శాతానికి తగ్గించింది. వాణిజ్య బ్యాంకుల్లో నగదు నిల్వలు పెరిగేందుకు ఇది దోహదపడుతుంది. ఎల్‌సీఆర్‌ను ఈ ఏడాది అక్టోబర్‌ 1 నాటికి 90 శాతానికి పెంచుతామని, వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నాటికి 100 శాతానికి పునరుద్ధరిస్తామని రిజర్వు బ్యాంకు ప్రకటించింది. 

ఆర్థిక వృద్ధిరేటులో మనమే బెటర్‌

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్నదని, 1930 తర్వాత ఇంతపెద్ద సంక్షోభం ఎన్నడూ తలెత్తలేదని శక్తికాంతదాస్‌ అన్నారు. ఇంతటి సంక్షోభ సమయంలోనూ వృద్ధిరేటు పాజిటివ్‌గా ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్‌ ఒకటని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 1.9 శాతం మేరకు నమోదు కావచ్చని ఆయన పేర్కొంటూ.. గ్రూప్‌-20 (జీ-20) దేశాల్లోకెల్లా ఇదే అత్యధిక వృద్ధిరేటని తెలిపారు.

ఎన్‌పీఏ నిబంధనల సడలింపు

నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ) లేదా మొండి బకాయిల గుర్తింపు నిబంధనలను ఆర్బీఐ సడలించింది. ప్రస్తుతం రుణగ్రహీతలు 90 రోజుల్లో తమ రుణాలను తిరిగి చెల్లించకపోతే వాటిని బ్యాంకులు నిరర్థక ఆస్తులుగా ప్రకటిస్తున్నాయి. ఈ గడువును ఆర్బీఐ ఇప్పుడు 180 రోజులకు పొడిగించింది. ఈ నిర్ణయంతో బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకొన్నవారు ప్రయోజనం పొందనున్నారు. ఎన్‌పీఎలలో పెరుగుదల ఉండదు గనుక బ్యాంకులు ఎన్‌బీఎఫ్‌సీల నుంచి మరిన్ని రుణాలు పొందేందేందుకు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్పొరేట్లు ఆసక్తిచూపే అవకాశం ఉంటుంది. 

ఆర్బీఐ కీలక ప్రకటనలు

 • రివర్స్‌ రెపోరేటు 25 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు. రెపోరేటు యథాతథం
 • రూ.50 వేల కోట్లతో రెండో విడుత టీఎల్‌టీఆర్‌వో
 • సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50 వేల కోట్ల ప్యాకేజీ. ఇందులో నాబార్డ్‌కు రూ.25 వేల కోట్లు, సిడ్బీకి రూ.15 వేల కోట్లు, ఎన్‌హెచ్‌బీకి రూ.10 వేల కోట్లు కేటాయింపు
 • వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్సెస్‌ (డబ్ల్యూఎంఏ) కింద రాష్ర్టాలకు కల్పించే ఓవర్‌డ్రాఫ్డ్‌ సదుపాయం 60 శాతానికి పెంపు
 • బ్యాంకుల లిక్విడిటీ కవరేజ్‌ రేషియో (ఎల్‌సీఆర్‌) 100 శాతం నుంచి 80 శాతానికి కుదింపు
 • మారటోరియం పీరియడ్‌లో 90 రోజుల ఎన్‌పీఏ గడువు వర్తించదు
 • 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను బ్యాంకుల డివిడెండ్ల చెల్లింపులు నిలిపివేత
 • దివాలా చట్టం కింద కేసుల పరిష్కార కాలపరిమితి 210 రోజుల నుంచి 300 రోజులకు పొడిగింపు.
 • ఖరీఫ్‌లో ధాన్యం ఉత్పత్తి 36 శాతం పెరుగుదల
 • బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయి
 • వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ వృద్ధిరేటు 7.4 శాతానికి చేరుతుందని అంచనా
 • లాక్‌డౌన్‌ తర్వాత (మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 14 మధ్యకాలంలో) రూ.1.2 లక్షల కోట్లు విడుదల చేశాం
 • ఇప్పటివరకు జీడీపీలో 3.2 శాతం నగదు అందుబాటులోకి తెచ్చాం


ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి రిజర్వు బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయాలు చిన్న స్థాయి పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలు, నిరుపేదలు, రైతులకు ఎంతోగానో ఉపయోగపడుతాయి.  అలాగే బ్యాంకు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ద్రవ్య  లభ్యతతోపాటు రుణ వితరణ సామర్థ్యం పెరుగుతుంది. డబ్ల్యూఎంఏ పరిమితి పెంపు వల్ల రాష్ర్టాలు కూడా ప్రయోజనం పొందుతాయి. 

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి


రిజర్వుబ్యాంక్‌ తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లో నిధుల ప్రవాహం పెరుగడంతోపాటు సులభంగా రుణాలు లభించనున్నాయి. నెలలోపే సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రకటించిన రెండో ఉద్దీపన ప్యాకేజీతో మొండి బకాయిల మార్గదర్శకాలు మరింత సులభతరం, డివిడెండ్‌ చెల్లింపులపై నిషేధం విధించడం, రివర్స్‌ రెపోరేటును పావు శాతం తగ్గించడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనున్నది. 

- నిర్మలా సీతారామన్‌,  కేంద్ర ఆర్థిక మంత్రి

నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలకు భారీ ఊరట లభించినట్లు అయింది. మార్కెట్లో నిధుల లభ్యత పెరుగనుండటంతో ప్రజలు కొనుగోళ్లు జరుపడానికి వీలుంటుంది’. 

- చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌

కరోనా వైరస్‌తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంకులకు భారీగా నిధులు లభించనున్నాయి. 

- సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్‌

4 శాతానికి ద్రవ్యోల్బణం 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నాటికి ద్రవ్యోల్బణం 4 శాతం దిగువకు పడిపోనున్నదని రిజర్వుబ్యాంక్‌ అంచనావేస్తున్నది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం 170 బేసిస్‌ పాయింట్లు తగ్గింది. మార్చి నెలలో రిటైల్‌ ధరల సూచీ నాలుగు నెలల కనిష్ఠ స్థాయి 5.91 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే.  

వ్యవస్థలోకి రూ.1.2 లక్షల కోట్లు 

గడిచిన 45 రోజుల్లో దేశీయ వ్యవస్థలోకి రూ.1.2 లక్షల కోట్ల నిధులు చొప్పించినట్లు రిజర్వుబ్యాంక్‌ తాజాగా ప్రకటించింది. కరోనా వైరస్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలోనూ మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 14 మధ్యకాలంలో లక్ష కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. వీటిలో గత నెలలోనే రూ.86 వేల కోట్ల నగదు చలామణి జరిగిందన్నారు. 

డివిడెండ్లు చెల్లించకండి..

కమర్షియల్‌, కో-ఆపరేటివ్‌ బ్యాంకులకు భారీ ఊరటను కల్పించింది రిజర్వు బ్యాంక్‌. ప్రతియేటా వాటాదారులకు, ప్రమోటర్లకు చెల్లిస్తున్న డివిడెండ్లను చెల్లించకండని సూచించింది. కరోనా వైరస్‌ దెబ్బకు కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థతో అటు కమర్షియల్‌, కో-ఆపరేటివ్‌ బ్యాంకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొక తప్పదని, దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను డివిడెండ్లను చెల్లించకూడదని ఆదేశించింది. ప్రస్తుతం బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు మెరుగ్గానే ఉన్నాయని, సెప్టెంబర్‌ వరకు ఈ డివిడెండ్‌ చెల్లింపులపై నిషేధం విధిస్తున్నట్లు శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఆదాయ రాబడులు మరింత తగ్గనున్నాయి. 

పెరిగిన ఫారెక్స్‌ రిజర్వులు

విదేశీ మారకం నిల్వలకు వచ్చిన ఢోకా లేదని శక్తికాంత దాస్‌ స్పష్టంచేశారు. ఈ నెల 10తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్‌ రిజర్వులు 2 బిలియన్‌ డాలర్లు పెరిగి 476.5 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయని తెలిపారు.  వచ్చే 11.8 నెలలకు సరిపడా ఫారెక్స్‌ రిజర్వులు లేదా ప్రతియేటా భారత్‌ దిగుమతుల విలువకు ఇది సమానం. కరోనా వైరస్‌తో కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది అతిపెద్ద ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఫిబ్రవరిలో భారత్‌లోకి 2.9 బిలియన్‌ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని, క్రితం ఏడాది ఇదే నెలలో వచ్చిన 1.9 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే సగానికి పైగా అధికమన్నారు. 

వచ్చే ఏడాది కోలుకోనున్న వృద్ధి

కరోనా వైరస్‌తో  కుదేలవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది వీ షేపులో కోలుకుంటుందని దాస్‌ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. పడిపోతున్న వృద్ధికి ఊతమివ్వడానికి సెంట్రల్‌ బ్యాంక్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నదన్న ఆయన.. గత మూడు వారాలుగా విడుదలవుతున్న గణాంకాలు ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. గతేడాది చివరి త్రైమాసికంలో వృద్ధిరేటు 4.7 శాతంగా ఉంటుందని గతంలో ఆర్బీఐ అంచనావేసింది. 


logo