ఆదివారం 12 జూలై 2020
National - May 28, 2020 , 20:35:53

నిన్న కేబీసీ విన్నర్‌.. నేడు ఐపీఎస్‌ ఆఫీసర్‌

నిన్న కేబీసీ విన్నర్‌.. నేడు ఐపీఎస్‌ ఆఫీసర్‌

న్యూఢిల్లీ: చదువుతో పాటు అదృష్టం కలిసొస్తే అనుకొన్నది సాధించగలుగుతాం అంటారు పెద్దలు. అలాంటి పెద్దల మాటను నిజం చేసి చూపాడు రాజస్థాన్‌కు చెందిన రవిమోహన్‌ సైనీ. 2001లో ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ప్రయోక్తా సోనీ టీవీలో ప్రసారమైన 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమంలో పాల్గొని అప్పడు కరోడ్‌పతిగా నిలిచాడు. కట్‌ చేస్తే.. రెండు దశాబ్దాల తర్వాత ఐపీఎస్‌ ఆఫీసర్‌గా మెరిశాడు. మధ్యలో జైపూర్‌లోని మహాత్మాగాంధీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ కూడా పూర్తిచేశాడు.

2001లో ప్రసారమైన కౌన్‌ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పాల్గొన్న రవిమోహన్‌ సైనికి అప్పుడు 14 ఏండ్లు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన కేబీసీ జూనియర్‌లో పాల్గొని 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి కరోడ్‌పతిగా  నిలిచాడు. అనంతరం జైపూర్‌లో ఉన్నతవిద్య పూర్తిచేసి అక్కడే ఎంబీబీఎస్‌ కూడా చదివాడు. నేవీలో పనిచేస్తున్న తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో 2014లో సివిల్స్‌ రాసి 461 ర్యాంకు సాధించిన రవిమోహన్‌ సైని.. హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోర్‌బందర్‌ ఎస్సీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలుచేయడంలో దృష్టిసారించామని, శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తానని ఆయన చెప్పారు. 14 ఏండ్ల ప్రాయంలో అమితాబ్‌ బచ్చన్‌ సార్‌తో కలువడం, కోటి రూపాయలు గెలువడం జీవితంలో మరిచిపోలేని అనుభూతులని అన్నారు. కాగా కౌన్‌ బనేగా కరోడ్‌పతి 12 వ  సెషన్‌ను త్వరలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని, రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయని సోనీ టీవీ యాజమాన్యం ఇప్పటికే ప్రకటించింది.


logo