సోమవారం 06 జూలై 2020
National - Jun 24, 2020 , 02:48:40

కదిలిన జగన్నాథుని రథం

కదిలిన జగన్నాథుని రథం

  • పూరీ నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన ఆంక్షలు
  • టీవీల్లో యాత్రను వీక్షించిన భక్తులు

పూరీ: సుప్రీంకోర్టు ఆంక్షల నేపథ్యంలో మంగళవారం పూరీ జగన్నాథ రథయాత్ర నిరాడంబరంగా జరిగింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చరిత్రలో తొలిసారిగా భక్తులు లేకుండానే, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య రథయాత్ర మొదలైంది. జగన్నాథున్ని దర్శించుకోవడానికి భక్తులు వచ్చే అవకాశమున్న నేపథ్యంలో పూరీ జిల్లావ్యాప్తంగా సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు కర్ఫ్యూ తరహా షట్‌డౌన్‌ను విధించామని డీజీపీ అభయ్‌ తెలిపారు. 

పూరీ నగరంలోకి ప్రవేశించే అన్ని మార్గాలను మూసేశామని తెలిపారు. జగన్నాథుడు, అతని సోదరుడు బలభద్రుడు, వారి సోదరి దేవి సుభద్రను గర్భగుడి నుంచి బయటకు తీసుకొచ్చిన పూజారులు రథాలపై చేర్చి ఊరేగించారు. యాత్రలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు అనుమతి లేకపోవడంతో టీవీలు, ఆన్‌లైన్‌ మాధ్యమాల్లో భక్తులు రథయాత్రను వీక్షించారు. రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్‌ షా, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొవిడ్‌-19పై విజయం సాధించేందుకు ప్రార్థనలు చేయాలని సూచించారు. 

మరోవైపు, కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన వాళ్లే రథయాత్రలో పాల్గొనాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. సోమవారం రాత్రి 1,143 మంది పూజారులు, పోలీసుల నమూనాల్ని పరీక్షించామని అధికారులు తెలిపారు. ఇందులో ఒక్కరికే పాజిటివ్‌ వచ్చిందని, దీంతో ఆ వ్యక్తిని యాత్రా కార్యక్రమాలకు దూరంగా ఉంచినట్టు తెలిపారు. కాగా రథయాత్రపై గతంలో విధించిన స్టేను సోమవారం సుప్రీంకోర్టు ఎత్తివేయడం తెలిసిందే. అయితే, ఒక్కో రథాన్ని 500 కంటే ఎక్కువ మంది లాగకూడదని, కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చిన వాళ్లే యాత్రలో పాల్గొనాలని కోర్టు పలు నిబంధనలను విధించింది.


logo