శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 11:14:03

ప్రేమించా.. పెళ్లి వ‌ర‌కు వెళ్లా.. కానీ: ర‌త‌న్ టాటా

ప్రేమించా.. పెళ్లి వ‌ర‌కు వెళ్లా.. కానీ: ర‌త‌న్ టాటా

హైదరాబాద్‌:  టాటా స‌న్స్ అధినేత ర‌త‌న్ టాటా త‌న మ‌నసులో భావాల్ని వ్య‌క్త‌ప‌రిచారు. హ్యూమ‌న్స్ ఆఫ్ బాంబే అనే ఫేస్‌బుక్ పేజీకి త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. అమెరికాలోని కార్నెల్ వ‌ర్సిటీలో చ‌దువుతున్న రోజుల్లో ఓ అమ్మాయితో ప్రేమాయ‌ణం సాగించిన‌ట్లు ర‌త‌న్ టాటా చెప్పారు. 82 ఏళ్ల ర‌త‌న్ జీవిత విశేషాల‌ను మూడు భాగాల్లో ఎఫ్‌బీలో ప్ర‌జెంట్ చేయ‌నున్నారు. అయితే తొలి భాగంలో ఆయ‌న త‌న చిన్న‌త‌నం గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పారు.  త‌న ప‌ద‌వ ఏట‌నే త‌న త‌ల్లితండ్రులు విడాకులు తీసుకున్నార‌ని, అప్పుడు త‌న బామ్మ‌ న‌వ‌జ్‌బాయ్ టాటా త‌న‌ను పెంచిన‌ట్లు చెప్పారు. అయినా బాల్యాన్ని ఎంజాయ్ చేసిన‌ట్లు తెలిపారు. 

రెండ‌వ ప్ర‌ప‌చం యుద్ధం త‌ర్వాత బామ్మ త‌న‌ను, త‌న సోద‌రుడిని లండ‌న్‌కు తీసుకువెళ్లార‌ని, అక్క‌డే త‌మ‌కు అనేక జీవిత విష‌యాల‌ను త‌మ బామ్మ నూరిపోసిన‌ట్లు ర‌త‌న్ తెలిపారు. త‌న తండ్రితో ఉన్న విభేదాల గురించి కూడా  ఆయ‌న చెప్పారు. అమెరికాలోని కాలేజీలో  చ‌ద‌వాల‌ని త‌న‌కు ఉండేద‌ని, కానీ త‌న తండ్రి మాత్రం లండ‌న్‌లో చ‌దివించాల‌నుకొన్న‌ట్లు చెప్పారు.  తాను ఆర్కిటెక్ట్ కావాల‌నుకుంటే, త‌న తండ్రి త‌న‌ను ఇంజినీర్ చేయాల‌నుకున్న‌ట్లు తెలిపారు. అయితే బామ్మ వ‌ల్లే తాను అమెరికాలోని కార్నెల్ వ‌ర్సిటీలో ఆర్కిటెక్చ‌ర్‌ చ‌దివిన‌ట్లు ర‌త‌న్ వెల్ల‌డించారు.  

ఆర్కిటెక్చ‌ర్‌లో డిగ్రీ చేసిన త‌ర్వాత అక్క‌డే రెండేళ్లు ఉద్యోగం చేసిన‌ట్లు ర‌త‌న్ తెలిపారు. ఆ రోజులు ఎంతో సంతోషంగా సాగాయ‌ని, తన‌కు స్వంత కారు ఉండేద‌ని, ఉద్యోగాన్ని ఎంతో ప్రేమించేవాడినని ర‌త‌న్ తెలిపారు. లాస్ ఏంజిల్స్‌లో ఉన్న‌ప్పుడే తాను ప్రేమ‌లో ప‌డిన‌ట్లు వ్యాపార‌వేత్త ర‌త‌న్ చెప్పారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే వ‌ర‌కు త‌మ రిలేష‌న్ వెళ్లింద‌న్నారు.  అయితే ఆ స‌మ‌యంలో త‌న‌ బామ్మ ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల ఇండియాకు తిరిగి వ‌చ్చాన‌ని, అదే స‌మ‌యంలో ఇండో చైనా యుద్ధం జ‌ర‌గ‌డం వ‌ల్ల ప‌రిస్థితులు తారుమారైన‌ట్లు చెప్పారు.  త‌న‌తో పాటు ఇండియాకు త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ వ‌స్తుంద‌ని ర‌త‌న్ భావించారు, కానీ యుద్ధం నేప‌థ్యంలో ఆ అమ్మాయి పేరెంట్స్ ఆమెను ఇండియాకు పంపేందుకు నిరాక‌రించిన‌ట్లు ర‌త‌న్ చెప్పారు. ఆ కార‌ణంగానే రిలేష‌న్ తెగిపోయింద‌న్నారు.  


logo