గురువారం 22 అక్టోబర్ 2020
National - Oct 11, 2020 , 09:32:29

అబ్బుర‌ప‌రుస్తున్న‌ అర్ధ‌నారీశ్వ‌ర ప‌క్షి!

అబ్బుర‌ప‌రుస్తున్న‌ అర్ధ‌నారీశ్వ‌ర ప‌క్షి!

హైద‌రాబాద్‌: హైంద‌వ సాంప్ర‌దాయంలో శివుడిని అర్ధ‌నారీశ్వ‌రుడిగా పూజిస్తారు. పార్వ‌తీదేవిని త‌న‌లో స‌గ‌భాగంగా చేసుకున్న రూపంలో శివ‌య్య అర్ధనారీశ్వరుడిగా పూజలు అందుకుంటాడు. ఈ పురాణ క‌థ‌నం గురించి దాదాపు చాలామందికి తెలుసు. కానీ ప‌క్షుల్లో కూడా స‌గభాగం ఆడ‌, స‌గభాగం మ‌గ ల‌క్ష‌ణాల‌తో ఉంటాయ‌నే సంగ‌తి మాత్రం చాలామందికి తెలియ‌దు. కానీ ఇది నిజం. పక్షుల్లోనూ అత్యంత అరుదుగా ఆడ‌, మ‌గ ల‌క్ష‌ణాలు ఒకే జీవిలో ఉంటాయ‌ని అమెరికా ప‌రిశోధ‌కులు తెలిపారు. 

అమెరికాలోని పెన్సిల్వేనియాలోగ‌ల‌ పౌడర్ మిల్ నేచర్ రిజర్వ్ సెంటర్‌లో సెప్టెంబ‌ర్ 24న అనే లిండ్సే అనే ప‌రిశోధ‌కులు స‌గ‌భాగం ఒక‌లా, స‌గ‌భాగం మ‌రోలా ఉన్న ప‌క్షిని గుర్తించారు. వెంటనే ఆమె తన బృందాన్ని అక్క‌డికి ర‌ప్పించి ఆ అరుదైన ప‌క్షిని ప‌ట్టుకున్నారు. ఈ ప‌క్షి దేహ మ‌ధ్య‌భాగంలో కుడివైపున‌కు గులాబీరంగులో, ఎడ‌మ‌వైపున‌కు ప‌సుపురంగులో ఉండ‌టం గ‌మ‌నించారు. దీనిపై ప‌రిశోధ‌న చేసి కుడివైపున పురుష రూపం, ఎడ‌మ‌వైపు స్త్రీ రూపం ఉన్న‌ట్లు క‌నిపెట్టారు. అందుకే స్త్రీ, పురుష ల‌క్ష‌ణాల క‌ల‌బోత‌గా ఉన్న ఈ అరుదైన ప‌క్షిని మ‌నం అర్ధ‌నారీశ్వ‌ర ప‌క్షిగా చెప్పుకోవ‌చ్చు.

ఈ అరుదైన ప‌క్షి శాస్త్రీయ నామం ఫియోటికస్ లూడోవిసియానస్. ఇలాంటి పక్షులు అత్యంత‌ అరుదుగా ఉంటాయని పౌడర్ మిల్ పరిశోధకులు పేర్కొన్నారు. దాదాపు 15 ఏండ్ల క్రితం తాము ఇలాంటి పక్షిని చూశామని, అండం అసాధరణ ఫలదీకరణ కారణంగా అప్పుడ‌ప్పుడు ఇలాంటి ప‌క్షులు జ‌న్మిస్తుండ‌వ‌చ్చున‌ని చెప్పారు. అయితే ఇలా జ‌న్మించిన ప‌క్షులు ఆడ‌వాటిలా ప్రవర్తిస్తాయా లేదంటే మ‌గ‌వాటిలా ప్రవర్తిస్తాయా అనే విష‌యంలో స్పష్టతలేదని ప‌రిశోధ‌కులు తెలిపారు. 

ఈ అరుదైన ప‌క్షుల్లో పునరుత్పత్తి కూడా ఉంటుందో లేదో అనే విష‌యంలో పరిశోధనలు జరగాల్సి ఉందని పౌడ‌ర్ మిల్స్ రిసెర్చ్ సెంట‌ర్ శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు. అయితే ఇలాంటి ప‌క్షులు చాలా అరుదుగా క‌నిపిస్తుంటాయి కాబ‌ట్టి ప‌రిశోధ‌న‌లు కూడా క‌ష్ట‌మేన‌ని వారు పేర్కొన్నారు. సుమారు 64 ఏండ్ల‌ పౌడర్ మిల్ రిసెర్చ్ సెంటర్ చరిత్రలో కేవ‌లం 10 వరకు మాత్ర‌మే ఇలాంటి ప‌క్షులు తార‌స‌ప‌డ్డాయ‌ని పరిశోధకులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo