బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 18, 2020 , 10:38:35

రేప్ కేసు వెన‌క్కి తీసుకోవాల‌ని ఒత్తిడి.. బాధితురాలి మృతి

రేప్ కేసు వెన‌క్కి తీసుకోవాల‌ని ఒత్తిడి.. బాధితురాలి మృతి

ల‌క్నో: ఆమెపై మూడు నెల‌ల క్రితం ఓ వ్య‌క్తి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి క‌ట‌క‌టాల్లోకి పంపించారు. అయితే అప్ప‌టినుంచి నిందితుని బంధువులు కేసు వెన‌క్కి తీసుకోవాల‌ని ఆమెపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కేసు ఉప‌సంహ‌రించుకోక‌పోతే కుటుంబ స‌భ్యుల అంతుచూస్తామ‌ని బెదిరించారు. దీంతో ఆమె నిన్న‌ ఆత్మాహుతికి పాల్ప‌డింది. చికిత్స‌పొందుతూ మృతిచెందింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బులంద్‌ష‌హ‌ర్ జిల్లాకు చెందిన ఓ 15 ఏండ్ల బాలిక‌పై, ఆ ఊర్లో ఉన్న ఒక‌ మామిడి తోట కాపాలాదారు ఆగ‌స్టు 15న లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. బాలిక త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేయ‌డంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అత‌డు ప్ర‌స్తుతం జైళ్లో ఉన్నాడు. అయితే కేసును వెన‌క్కి తీసుకోవాల‌ని నింతుని మామ‌, అత‌ని స్నేహితులు బాధితురాలిపై ఒత్తిడిచేస్తున్నారు. కేసు వాప‌స్ తీసుకోక‌పోతే కుటుంబ‌స‌భ్యుల‌ను చంపేస్తామ‌ని బెదిరించారు. దీంతో నిన్నఆమె ఆత్మాహుతికి పాల్ప‌డింది. తీవ్రంగా గాయ‌ప‌డిన ఆమెను మంగ‌ళ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు స్థానిక ద‌వాఖాన‌కు తీసుకెళ్లార‌ని, మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి త‌ర‌లించారని, చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతిచెందింద‌ని బులంద్‌ష‌హ‌ర్ ఎస్ఎస్పీ సంతోష్ కుమార్ చెప్పారు. 

కాగా, కేసు వెన‌క్కి తీసుకోక‌పోడంతో నిందితుని కుంటుంబ స‌భ్యులు త‌మ కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించార‌ని ఆమె తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అయితే మంట‌ల్లో గాయ‌ప‌డిన ఆమెను బులంద్‌ష‌హ‌ర్ ప్ర‌భుత్వ ద‌వాఖానకు తీసుకువ‌చ్చిన‌ప్పుడు బెదిరింపుల‌కు పాల్ప‌డ‌టంతో ఆత్మాహుతి చేసుకున్నాన‌‌ని బాధితురాలు చెప్పిన‌ట్లు వీడియో రికార్డులో తేలింది. దీంతో నిజానిజాలు ద‌ర్యాప్తులో తేలుతాయ‌ని సంతోష్ కుమార్ వెల్ల‌డించారు.