గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 01:53:15

రామాలయ ట్రస్ట్‌ అధ్యక్షుడిగా గోపాల్‌దాస్‌

రామాలయ ట్రస్ట్‌ అధ్యక్షుడిగా గోపాల్‌దాస్‌
  • మందిర నిర్మాణ కమిటీ అధ్యక్షుడిగా నృపేంద్ర మిశ్రా
  • ట్రస్ట్‌ తొలి సమావేశంలో ఎన్నిక

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయం నిర్మాణ పర్యవేక్షణకు ఏర్పాటుచేసిన ‘శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్‌ అధ్యక్షుడిగా మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌, ప్రధాన కార్యదర్శిగా వీహెచ్‌పీ ఉపాధ్యక్షుడు చంపత్‌ రాయ్‌ ఎన్నికయ్యారు. సీనియర్‌ న్యాయవాది కే పరాశరణ్‌ నివాసంలో బుధవారం జరిగిన ట్రస్ట్‌ తొలి సమావేశంలో వీరిని ఎన్నుకున్నారు. ప్రధాని మోదీకి గతంలో ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన నృపేంద్ర మిశ్రాను మందిర నిర్మాణ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రామాలయ నిర్మాణానికి వీహెచ్‌పీ ఏర్పాటు చేసిన ‘రామజన్మభూమి న్యాస్‌' ట్రస్ట్‌కు గోపాల్‌దాస్‌ అధిపతిగా ఉన్నారు. రామమందిరం నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు విధివిధానాల రూపకల్పనే లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. ఏప్రిల్‌లో మందిరం నిర్మాణం మొదలుపెట్టాలని సభ్యులు భావిస్తున్నారు. నిర్మాణం 3-4 ఏండ్లు పట్టొచ్చని సమాచారం.


రామాలయ ప్రధాన మోడల్‌ వీహెచ్‌పీ రూపొందించిన తరహాలోనే ఉంటుందని, అయితే ఎత్తు, వెడల్పు మారొచ్చని దాస్‌ తెలిపారు. మందిరం నిర్మాణం కోసం విరాళాలు సేకరించేందుకు అయోధ్యలోని ఎస్బీఐ బ్రాంచ్‌లో ఖాతా తెరువాలని నిర్ణయించినట్లు సమావేశం అనంతరం చంపత్‌రాయ్‌ మీడియాకు వెల్లడించారు. పుణేకు చెందిన స్వామి గోవింద్‌ దేవ్‌ గిరిని ట్రస్ట్‌ కోశాధికారిగా నియమించారు. పెజావర్‌ మఠానికి చెందిన స్వామి విశ్వప్రసన్నతీర్థ్‌ ఆయనకు రూ.5లక్షల విరాళం అందజేశారు. సమావేశంలో మొత్తం తొమ్మిది తీర్మానాలు ఆమోదించారు. అయోధ్య వివాదంపై గతేడాది నవంబర్‌ 9న సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పును అనుసరించి మోదీ సర్కారు 15 మంది సభ్యులతో కూడిన ఈ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసింది. ఇదివరకే తొమ్మిది మంది సభ్యులను  నామినేట్‌ చేసింది. 


logo
>>>>>>