సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 10:51:04

మ‌రో చోటుకు క‌దిలిన అయోధ్య రాముడు..

మ‌రో చోటుకు క‌దిలిన అయోధ్య రాముడు..

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి తొలి ఘ‌ట్టం పూర్తి అయ్యింది.  చైత్ర న‌వ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా రామ జ‌న్మ‌భూమిలో ఉన్న రాముడి విగ్ర‌హాన్ని ఇవాళ ఉద‌యం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ మ‌రో చోటుకు త‌ర‌లించారు. పురుషోత్త‌ముడు రామ్ ల‌ల్లాను మాన‌స భ‌వ‌న్‌లోకి త‌ర‌లించిన‌ట్లు ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.  ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు ఆయ‌న గ‌త రాత్రే అయోధ్య చేరుకున్నారు.  ఇవాళ ఉద‌యం 4 గంట‌ల‌కు ఈ ప‌విత్ర కార్యాన్ని నిర్వ‌హించారు. వైదిక మంత్రాలు, మంగ‌ళ‌వాద్యాలు, పాట‌ల మ‌ధ్య రాముడి విగ్ర‌హాన్ని త‌ర‌లించారు.  రామ‌జ‌న్మ‌భూమిలో రామాల‌య నిర్మాణం పూర్తి అయ్యే వ‌ర‌కు రామ్ ల‌ల్లా విగ్ర‌హం మాన‌స్ భ‌వ‌న్‌లో విరాజితులై ఉంటారు. రామాల‌య నిర్మాణం కోసం సీఎం యోగి 11 ల‌క్ష‌ల చెక్‌ను కూడా అంద‌జేశారు. 

రాముడి మూర్తిని ర‌జ‌త సింహాస‌నంపై కూర్చోబెట్ట‌నున్నారు.  విగ్ర‌హం సుమారు 25 ఇంచుల ఎత్తు, 15 ఇంచు వెడ‌ల్పు ఉన్న‌ది. ర‌జ‌త సింహాస‌నం సుమారు 30 ఇంచుల ఎత్తు ఉన్న‌ది.  దాని బ‌రువు సుమారు 9.5 కేజీలు.  అయోధ్య‌కు చెందిన గ‌త ప్ర‌భువులు భీమ్‌లేంద్ర మోహ‌న్ మిశ్రా ఆ సింహాస‌నాన్ని బ‌హూక‌రించారు. శ్రీ రామ్ తీర్థ క్షేత్ర ట్ర‌స్టులో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు.  రామ‌జ‌న్మ‌భూమిలో రామ్ ల‌ల్లా విగ్ర‌హాన్ని చెక్క సింహాస‌నంపై కూర్చోబెట్టారు. 1992 నుంచి ఆ విగ్ర‌హాం అలాగే ఉన్న‌ది.  


logo