సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 03:02:29

వ్యవసాయానికి బ్లాక్‌ డే

వ్యవసాయానికి బ్లాక్‌ డే

 • చర్చ జరగలేదు ఓటింగ్‌ జరపలేదు
 • మన రైతాంగానికి మరణ శాసనాలు
 • ముక్తకంఠంతో నిరసించిన విపక్షాలు
 • ఐనా మొండి పట్టు వీడని మోదీ సర్కార్‌
 • సాగు బిల్లులకు నిరంకుశ ఆమోదం.. రాజ్యసభలో అసాధారణం
 • హరివంశ్‌పై అవిశ్వాసానికి నోటీస్‌
 • మెజారిటీ లేకున్నా మూజువాణీ పద్ధతి
 • ఓటింగ్‌ జరపాలన్న డిమాండ్‌ బుట్టదాఖలు
 • మండిపడిన ప్రతిపక్షాలు.. సభలోనే ధర్నా
 • మార్షల్స్‌ రాక.. విపక్ష సభ్యులపై దాడి
 • బిల్లులు పాసైనట్టు చెప్పిన డిప్యూటీ చైర్మన్‌
 • ఆందోళన మధ్యే హరివంశ్‌ రూలింగ్‌
 • రాజ్యసభలో  అసాధారణ పరిస్థితులు 

రాజ్యసభ రణరంగంగా మారింది. మోదీ సర్కారు అప్రజాస్వామిక, మొండి వైఖరి.. ప్రతిపక్షాల పోరాటంతో పెద్దల సభలో ఆదివారం అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్కరణల పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన బిల్లులను అడ్డుకొనేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. సభలో మెజార్టీ లేకున్నా ఆమోదం పొందేందుకు సర్కారు మొండి పట్టు చూపింది. దీంతో పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. ఎలాంటి చర్చ, ఓటింగ్‌ లేకుండానే బిల్లులకు ఆమోదం లభించినట్టు ప్రకటించి డిఫ్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ సభను వాయిదా వేశారు. దీంతో డిఫ్యూటీ చైర్మన్‌పై 12 ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాసానికి నోటీసులిచ్చాయి.

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 20: వ్యవసాయ మార్కెటింగ్‌ రంగంలో సంస్కరణలు ప్రతిపాదిస్తూ కేంద్రప్రభుత్వం తెచ్చిన బిల్లులు రాజ్యసభలో ఆదివారం తీవ్ర గందరగోళం సృష్టించాయి. దేశంలోని రైతాంగమంతా వ్యతిరేకిస్తున్నప్పటికీ బిల్లులను ఆమోదింపజేసుకోవాలన్న పట్టుదలతో ప్రభుత్వం ప్రయత్నించటంతో సభలో అసాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. సమగ్ర చర్చ, ఓటింగ్‌ లేకుండా బిల్లులు పాస్‌ అయినట్టు డిఫ్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ ప్రకటించటంతో సభలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. బిల్లు ప్రతులను చించి సభలో వెదజల్లారు. ప్రొసీడింగ్‌ అధికారుల టేబుళ్లపైకి ఎక్కేందుకు కొందరు సభ్యులు ప్రయత్నించటంతో మార్షల్స్‌ అడ్డుకున్నారు. ఇంతటి గందరగోళం మధ్యే ఓటింగ్‌ నిర్వహించకుండానే మూజువాణి ఓటుతో బిల్లులకు సభ ఆమోదం లభించిందని ప్రకటించిన డిఫ్యూటీ చైర్మన్‌, వెంటనే సభను సోమవారానికి వాయిదా వేసి వెళ్లిపోయారు. దాంతో డిఫ్యూటీ చైర్మన్‌ తీరుపై మండిపడ్డ 12 ప్రతిపక్ష పార్టీలు ఆయనపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. 

మెజార్టీ లేకున్నా ఆమోదం!

ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యసభలో ఇప్పటికీ మెజారిటీ లేదు. కానీ ఆదివారం వ్యవసాయ బిల్లులను విపక్షాల వ్యతిరేకత మధ్య ప్రభుత్వం ఆమోదింపజేసుకోవటంపై సామాన్యులు కూడా ముక్కున వేలేసుకున్నారు. రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి 110 మంది సభ్యులున్నారు. యూపీఏకు 60మంది ఉండగా, ఈ రెండు పక్షాలు కానివారు 70మంది ఉన్నారు. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ మద్దతు తెలుపగా అకాలీదళ్‌ వ్యతిరేకించింది. ఎలా చూసినా సభలో ఎన్డీఏకు మెజార్టీ వచ్చే అవకాశమే లేదు. విపక్షాల బలం 130 ఉన్నది. దాంతో ఓటింగ్‌ జరగకుండా మోదీ సర్కారు బిల్లులను దొడ్డిదారిన ఆమోదింపజేసుకున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి.

బిల్లులు చరిత్రాత్మకం: ప్రభుత్వం 

గురువారం లోక్‌సభ ఆమోదించిన ‘రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహకాలు, సౌకర్యాలు) బిల్లును, ధరల హామీ, రైతు సేవల ఒప్పంద బిల్లును వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆదివారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు రైతుల జీవితాలను సమూలంగా మార్చివేస్తాయని చెప్పారు. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకొనేందుకు వీలు కలుగుతుందన్నారు. కనీస మద్దతుధర అలాగే కొనసాగుతుందన్నారు.

రైతుల పాటి మరణశాసనం: ప్రతిపక్షాలు


ఈ బిల్లులను మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు వాటిని వెనక్కు తీసుకోవాలని గట్టిగా డిమాండ్‌ చేశాయి. విస్తృత అధ్యయనం, అభిప్రాయ సేకరణ కోసం వాటిని సెలెక్ట్‌ కమిటీకి పంపాలని కోరాయి. బిల్లులకు పలు సవరణలు కూడా ప్రతిపాదించాయి. అయితే, ప్రతిపక్షాల విన్నపాలను వేటినీ సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిఫ్యూటీ చైర్మన్‌ పరిగణనలోకి తీసుకోకపోవటంతో పలువురు విపక్ష సభ్యులు చైర్మన్‌ పోడియం వద్దకు దూసుకుపోయి నిరసనకు దిగారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ డెరెక్‌ ఒబ్రియన్‌, డీఎంకే సభ్యుడు తిరుచ్చిశివ, కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌, సీపీఎం నేత కేకే రాజేశ్‌లు బిల్లు పత్రాలను చించి వెదజల్లారు. ప్రొసీడింగ్‌ అధికారి ముందు ఉన్న రూల్‌ బుక్‌ను లాక్కున్న డెరెక్‌ డిఫ్యూటీ చైర్మన్‌పైకి విసిరి కొట్టడంతో మార్షల్స్‌ అడ్డుకున్నారు. కొందరు సభ్యులు డిఫ్యూటీ చైర్మన్‌ మైక్‌ను విరిచేందుకు ప్రయత్నించారు. దాంతో సభను 15 నిమిషాలు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభించగానే బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపాలని శిరోమణి అకాలీదళ్‌ సభ్యుడు నరేశ్‌ గుజ్రాల్‌ డిమాండ్‌ చేశారు. ప్రజలకు మరణశాసనం లాంటి ఈ బిల్లులపై తాము సంతకం చేయబోమని కాంగ్రెస్‌ ఎంపీ ప్రతాప్‌సింగ్‌ బజ్వా తెగేసి చెప్పారు.

సభ సమయం ముగిసినా..

ప్రతిపక్షాల ఆందోళన కొనసాగుతుండగానే సభ సమయం ముగిసింది. దాంతో చర్చను రేపటికి వాయిదా వేయాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. ఆ డిమాండ్‌ను తిరస్కరించిన డిఫ్యూటీ చైర్మన్‌, సభ సమయాన్ని పొడిగించి చర్చను కొనసాగించారు. బిల్లులపై ఓటింగ్‌ నిర్వహించాలని విపక్ష సభ్యులు కోరగా, సభ్యులంతా తమతమ సీట్లలోకి వెళితేనే ఓటింగ్‌ నిర్వహిస్తానని డిఫ్యూటీ చైర్మన్‌ స్పష్టంచేశారు. దాంతో ఆందోళన చేస్తున్న సభ్యులు తమ సీట్లలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే సభ మూజువాణి ఓటుతో బిల్లులకు ఆమోదం తెలిపిందని ప్రకటించటంతో విపక్ష సభ్యులు ముఖముఖాలు చూసుకొని ఖిన్నులయ్యారు. డిఫ్యూటీ చైర్మన్‌ తీరుకు నిరసనగా  విపక్ష సభ్యులు సమావేశ మందిరంలోనే ధర్నాకు దిగారు. దేశ చరిత్రలో ఇదో చీకటి రోజని కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌ విమర్శించారు.. బిల్లులను ఆమోదించరాదని శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కోరారు. 

ఈ కరోనా కాలంలో ఇంత ఆదరాబాదరాగా ఈ బిల్లులను ఎందుకు ఆమోదింపజేసుకోవాలని అనుకుంటున్నారో ప్రధానమంత్రి వచ్చి వివరణ ఇవ్వాలి. ఈ బిల్లులతో రైతులకు ఎలాంటి ప్రయోజనాలు సమకూరుతాయో వివరించాలి. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఎలా సాధిస్తాయో చెప్పాలి.

- హెచ్‌డీ దేవెగౌడ, జేడీఎస్‌ నేత, మాజీ ప్రధాని

దేవెగౌడ ప్రమాణం

మాజీ ప్రధాని, జేడీఎస్‌ నేత దేవెగౌడ ఆదివారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. సభ ప్రారంభం కాగానే చైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆయన చేత ప్రమాణం చేయించారు. 

డిఫ్యూటీ చైర్మన్‌పై అవిశ్వాసం

సభా నియమాలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ 12 ప్రతిపక్ష పార్టీలు డిఫ్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. వీటిలో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, టీఎంసీ, ఎన్సీపీ,  డీఎంకే, ఆమ్‌ఆద్మీ, ఎస్పీ, ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌ (మణి) ఉన్నాయి.

సభ్యులపై చర్యలు? 

రాజ్యసభలో వెల్‌లోకి దూసుకెళ్లి గందరగోళం సృష్టించిన సభ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిర్ణయించినట్టు సమాచారం. సభ వాయిదా పడిన అనంతరం ఆయన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెంకయ్యతోపాటు డిఫ్యూటీ చైర్మన్‌ హరివంశ్‌నారాయణ్‌ సింగ్‌, రాజ్యసభ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, రాజ్యసభలో ఆదివారం చైర్మన్‌ పోడియం వద్దకు దూసుకుపోయి అనుచితంగా ప్రవర్తించిన విపక్ష సభ్యులను రూల్‌ 256 ప్రకారం సస్పెండ్‌ చేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు.  మరోవైపు, భవిష్యత్‌ కార్యచరణపై విపక్ష పార్టీలు సోమవారం  ఉదయం సమావేశం కానున్నట్టు సమాచారం. 

మూడో బిల్లుపై తర్వాత.. 

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు మొత్తం మూడు. ‘రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య (ప్రోత్సాహకాలు, సౌకర్యాలు) బిల్లు’, ‘ధరల హామీ, రైతు సేవల ఒప్పంద బిల్లు’, ‘నిత్యావసర వస్తువుల చట్టసవరణ బిల్లు’. ఈ మూడూ లోక్‌సభ ఆమోదం పొందాయి. కానీ, ఆదివారం రాజ్యసభలో మాత్రం తొలి రెండు బిల్లులే ఆమోదం పొందాయి. మూడో బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టినప్పటికీ చర్చ చేపట్టలేదు.


ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని అంటున్నారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపుచేస్తామని ప్రభుత్వం చెప్తున్నది. ప్రస్తుత ధరలను బట్టిచూస్తే 2028నాటికి కూడా ఆ లక్ష్యం నెరవేరదు. రాజ్యసభలో నేడు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్యచేసింది. 

- డెరెక్‌ ఒబ్రెయిన్‌, టీఎంసీ ఎంపీ


logo