గురువారం 16 జూలై 2020
National - Jun 19, 2020 , 19:25:28

రాజ్యసభ స్థానాలకు వెలువడిన ఫలితాలు.. ఏపీలో వైసీపీ విజయం

రాజ్యసభ స్థానాలకు వెలువడిన ఫలితాలు.. ఏపీలో వైసీపీ విజయం

ఢిల్లీ : వివిధ రాష్ర్టాల్లో రాజ్యసభ స్థానాలకు నేడు జరిగిన ఎన్నికల పోలింగ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. 8 రాష్ర్టాల్లో 19 రాజ్యసభ స్థానాలకు నేడు పోలింగ్‌ను చేపట్టారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. పోలింగ్‌ ముగిసిన వెంటనే కౌంటింగ్‌ను చేపట్టారు. గుజరాత్‌లో నాలుగు స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌-4, రాజస్థాన్‌-3, జార్ఖండ్‌-2, మణిపూర్‌-1, మేఘాలయా-1, మిజోరాంలో 1 స్థానానికి నేడు పోలింగ్‌ జరిగింది. ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ నిర్వహణకు సాధారంగా చేసే ఏర్పాట్లతో పాటు కరోనా దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఓటేసే మార్గం, ఓటేసిన తర్వాత బయటకు వచ్చే మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేసింది. అంసెబ్లీలోకి ప్రవేశించే ఎమ్మెల్యేలకు థర్మల్‌ స్క్రీనింగ్‌ను నిర్వహించింది.

ఏపీలో జరిగిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో అధికార వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని విజయం సాధించారు. 

రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ మూడు రాజ్యసభ స్థానాలకు గాను రెండు గెలుపొందింది. బీజేపీ ఒక స్థానంలో గెలిచింది. మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ రెండు స్థానాలు గెలుచుకోగా ప్రత్యర్థి కాంగ్రెస్‌ ఒక స్థానంలో గెలుపొందింది. రాజస్థాన్‌ నుంచి కాంగ్రెస్‌కు చెందిన కేసీ వేణుగోపాల్‌, నీరజ్‌ దాంగి గెలుపొందగా బీజేపీ నుంచి రాజేంద్ర గెహ్లాట్‌ ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ నుంచి జ్యోతిరాదిత్య సింథియా, సుమేర్‌ సింగ్‌ సోలంకి ఎన్నికవగా కాంగ్రెస్‌ నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ రాజ్యసభకు ఎన్నికయ్యారు. మేఘాలయలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ అభ్యర్థి డబ్ల్యూ ఖర్లూకీ విజయం సాధించారు. 


logo