ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 18:39:44

అండర్‌ పాస్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాజ్‌నాథ్

అండర్‌ పాస్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాజ్‌నాథ్

డెహ్రాడూన్‌ : భారత మిలటరీ అకాడమీ ఉత్తర, మధ్య, దక్షిణ క్యాంపస్‌లను కలిపే రెండు అండర్‌పాస్‌ల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ ఇవాళ ఇండియన్‌ మిలటరీ అకాడమీలో ప్రతిపాదిత అండ్‌ పాస్‌ల శంకుస్థాపన చేసేందుకు మీ అందరి మధ్యలో ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మన దేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్మీ అకాడమీల్లో డెహ్రాడూన్‌ ఒకటని అన్నారు. ఇక్కడి నుంచి శిక్షణ పొందిన అధికారులు యుద్ధంలో వీరత్వానికి ఉదాహరణగా ఉండడమే కాకుండా, భారత సైన్యంలో అత్యున్నత స్థాయి నుంచి నాయకులుగా కూడా పని చేశారని, దీనికి అనేక ఊదాహారణలు ఇక్కడ ఉన్నాయన్నారు.

క్యాంపస్‌ల మధ్య రోడ్డును దాటేందుకు ట్రాఫిక్‌ను మా కేడెట్స్‌ అడ్డుకోవడం వింతగా ఉందన్నారు. స్థానికంగా నివాసం ఉండే ప్రజల సౌకర్యం, భద్రత కూడా ఇందులోనే ఉంటుందన్నారు. వీరు రాబోయే ఆఫీసర్లను ప్రత్యక్షంగా, పరోక్షంగా సిద్ధం చేయడంలో కీలకపాత్ర పోషిస్తారన్నారు. అండర్‌ పాస్‌ల నిర్మాణ ప్రాజెక్టుకు చాలా ఏళ్ల క్రితమే సిద్ధం కావాల్సిందని, నిర్మాణానికి అనుమతి వచ్చేందుకు దశాబ్దాలు పట్టడం ఆశ్చర్యం వేస్తుందన్నారు. 40 ఏళ్లలో 25-30 తరాల ట్రైనీ కేడెట్లు ఇబ్బందులు పడ్డారన్నారు.  మారుతున్న కాలంతో పాటు రాజధాని డెహ్రాడూన్‌లోనూ ట్రాఫిక్ పెరుగుతోందని, అండ‌ర్‌ పాస్‌ల నిర్మాణంతో ఎన్‌హెచ్‌-72పై ట్రాఫిక్‌ జామ్‌ నుంచి ఉపశమనం కలిగిస్దుందని, డెహ్రాడూన్ ప్రజలకు మాత్రమే కాకుండా ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలకు వచ్చే ప్రయాణికులకు ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రాజెక్టు నిర్మాణం గడువులోగా పూర్తి కావాలని ఆశిస్తున్నట్లు రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. డెహ్రాడూన్‌లోని మిలటరీ శిక్షణ అకాడమీకి చెందిన మూడు క్యాంపస్‌లను జాతీయ రహదారి-72 వేరు చేస్తుంది. దీన్ని చక్ర రహదారి అని కూడా పిలుస్తారు. ఒక క్యాంప్‌ నుంచి మరో క్యాంప్‌కు వెళ్లేందుకు కేడెట్లు రహదారిపై ట్రాఫిక్‌ను ఆపాల్సి వస్తుంది. 1978లో అండర్‌ పాస్‌లను నిర్మించాలని ప్రతిపాదించగా.. సుమారు 40 ఏళ్ల తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శంకుస్థాపన చేశారు. రూ.45 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్, డీజీపీ అనిల్ రాటూరి, ఐఎంఏ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ జైవీర్ సింగ్ నేగి పాల్గొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo