శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 18, 2020 , 15:47:31

అమర్‌నాథ్‌ ఆలయంలో రక్షణ మంత్రి పూజలు

అమర్‌నాథ్‌ ఆలయంలో రక్షణ మంత్రి పూజలు

శ్రీనగర్ :  రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శనివారం అమర్‌నాథ్‌ గుహను సందర్శించి, ఆలయంలో పూజలు చేశారు. అనంతరం సుమారు గంట పాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపారు. అమర్‌నాథ్‌ గుహ ఆలయం హిందూమతంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా పరిగణించబడుతున్నది. ఏటా లక్షలాది మంది యాత్ర ద్వారా మంచు రూపంలో దర్శనమిచ్చే పరమేశ్వరుడిని దర్శించుకుంటారు. ఈ సారి కరోనా మహమ్మారి క్రమంలో భక్తులకు అనుమతి ఇవ్వలేదు. చరిత్రలో తొలిసారిగా హారతి కార్యక్రమాన్ని ప్రసార భారతిలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. 

కాగా, రాజ్‌నాథ్‌సింగ్‌ రెండు రోజుల పర్యటన కోసం జమ్మూ కశ్మీర్‌ వచ్చారు. శుక్రవారం  జమ్మూ కశ్మీర్‌లో మొత్తం భద్రత పరిస్థితిని ఉన్నత స్థాయి సైనిక అధికారులతో సమీక్షించారని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ ఏ దుస్సాహసానికి పాల్పడ్డా తగిన సమాధానం ఇవ్వాలని ఆయన సాయుధ దళాలకు సూచించారు. పాకిస్థాన్‌తో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట కట్టుదిట్టమైన నిఘాను కొనసాగించాలని కూడా రక్షణ మంత్రి చెప్పారు. పర్యటనలో రెండో రోజు అమర్‌నాథ్‌ గుహను సందర్శించారు. ఆలయంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్,  ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవానే, ఇతర ఉన్నతాధికారులు పూజలు చేశారు. 

ఫార్వర్డ్‌ పోస్టును సందర్శించిన రక్షణమంత్రి

అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శనివారం కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్ ఓసి) సమీపంలోని ఫార్వర్డ్ పో‌స్ట్‌ను సందర్శించారు. ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే ఉన్నారు.  ‘ఇవాళ జమ్మూ-కశ్మీర్ లోని కుప్వారా జిల్లా ఎల్ఓసీకి సమీపంలో ఫార్వర్డ్ పోస్ట్‌ను సందర్శించాను. అక్కడ మోహరించిన సైనికులతో సంభాషించానని, ప్రతి సందర్భంలోనూ మన దేశాన్ని కాపాడుతున్న ఈ ధైర్యసాహసాలు, సైనికులకు మేం ఎంతో గర్విస్తున్నాం' అని రక్షణ మంత్రి ట్వీట్ చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo