శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 22, 2020 , 01:45:57

శక్తిమంత దేశాల్లో భారత్‌

శక్తిమంత దేశాల్లో భారత్‌
  • రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ వెల్లడి
  • సైనిక ప్రధాన కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ

న్యూఢిల్లీ: భారత సైన్యం ప్రధాన కార్యాలయ నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం భూమి పూజ చేశారు. ఢిల్లీలోని కంటోన్మెంట్‌ ప్రాంతంలో 39 ఎకరాల్లో నిర్మించనున్న ఏడంతస్తుల భవనానికి ‘థాల్‌ సేనా భవన్‌' అని నామకరణం చేశారు. వెలిగే సూర్యుడు ఆకృతిలో దీన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ మన శక్తి సామర్థ్యాలను చూసి భారత్‌ బలహీనదేశం కాదని, శక్తివంతమైన దేశాల్లో ఒకటని ప్రపంచదేశాలు గుర్తించాయన్నారు. ఈ గుర్తింపు, గొప్పతనం అంతా మన అమర జవాన్లకే చెందుతుందని తెలిపారు. ‘భారత్‌ అత్యంత శక్తి సామర్థ్యాలు గల దేశంగా నిలదొక్కుకోవాలన్నది మన అమర జవాన్ల కోరిక. వారి కోరిక సాకారమైంది. సైనిక సంపత్తి పరంగా ప్రపంచంలోనే శక్తి సామర్థ్యాలు కలిగిన దేశాల్లో భారత్‌ ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం మనం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే స్థితిలో ఉన్నాం’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. సైన్యాధిపతి నరవణె మాట్లాడుతూ ఈ నూతన భవనం పూర్తవ్వడానికి మూడునాలుగేండ్లు పట్టొచ్చని, దీని కోసం దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. 


logo