ఆదివారం 24 జనవరి 2021
National - Dec 29, 2020 , 12:09:08

పార్టీ ఏర్పాటుపై ర‌జినీకాంత్ సంచ‌ల‌న నిర్ణ‌యం

పార్టీ ఏర్పాటుపై ర‌జినీకాంత్ సంచ‌ల‌న నిర్ణ‌యం

చెన్నై : త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో పార్టీ పేరు ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పిన సూప‌ర్ స్టార్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు. ప్ర‌స్తుతం పార్టీ పెట్ట‌ట్లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌న అనారోగ్యం దేవుడి హెచ్చ‌రిక‌గా భావిస్తున్నాన‌ని చెప్పారు. త‌ప్ప‌కుండా రాజ‌కీయాల్లోకి వ‌స్తా.. కానీ ఇప్పుడు కాదు అని తేల్చిచెప్పారు. అనారోగ్యం కార‌ణంగానే ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు.

తాత్కాలిక విర‌మ‌ణ

నూత‌న పార్టీ ఆలోచ‌న‌కు తాత్కాలిక విర‌మ‌ణ‌ ప్ర‌క‌టిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. పార్టీ ఆలోచ‌న‌ను అనారోగ్యం కాస్త వెన‌క్కి నెట్టింద‌న్నారు. ఆరోగ్యం ప్రాధాన్య‌మ‌ని ఆత్మీయులు సూచించారు. నిజం మాట్లాడ‌టానికి ఎప్పుడూ వెనుకాడను. రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా ప్ర‌జాసేవ నిరంత‌రం కొన‌సాగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు. త‌న నిర్ణ‌యం అభిమానుల‌ను బాధ పెట్టొచ్చు.. త‌న‌ను క్షమించాల‌ని కోరారు. 

రాజ‌కీయ తిరుగుబాటు సృష్టించ‌లేను..

‘అన్నాత్తే’ షూటింగ్‌ కోసం హైద‌రాబాద్ వెళ్లిన‌ప్పుడు అనారోగ్యం పాల‌య్యాను అని ర‌జినీకాంత్ తెలిపారు. క‌రోనా నెగిటివ్ వ‌చ్చినా అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డ్డాను. ర‌క్త‌పోటులో హెచ్చుత‌గ్గులు కిడ్నీల‌పై ప్ర‌భావం చూపుతాయ‌ని వైద్యులు చెప్పారు. పార్టీ ప్రారంభించినా కేవ‌లం సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తే గెల‌వ‌లేను. ప్ర‌జ‌లు ఆశించే స్థాయిలో రాజ‌కీయ తిరుగుబాటు సృష్టించ‌లేను. రాజ‌కీయ అనుభ‌వ‌మున్న ఎవరైనా ఈ వాస్త‌వాన్ని అంగీకరిస్తారు అని ర‌జినీకాంత్ పేర్కొన్నారు. 


logo