మంగళవారం 19 జనవరి 2021
National - Dec 30, 2020 , 01:12:07

రజినీ యూటర్న్‌

రజినీ యూటర్న్‌

  • అనారోగ్యం కారణంగా రాజకీయాల్లోకి రాలేకపోతున్నా
  • నా తోటి సహచరులను ఇబ్బందుల్లోకి నెట్టలేను
  • రాజకీయ అరంగేట్రంపై తలైవా అనూహ్య ప్రకటన
  • పాలిటిక్స్‌లో లేకున్నా ప్రజాసేవ చేస్తానని వెల్లడి

చెన్నై, డిసెంబర్‌ 29: తమిళ నటుడు, సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ (70) తన రాజకీయ అరంగేట్రంపై అనూహ్య ప్రకటన చేశారు. అనారోగ్య కారణాల రీత్యా తాను రాజకీయాల్లోకి రాలేనని, పార్టీ పెట్టట్లేదని స్పష్టంచేశారు. తనకు అస్వస్థత కలుగటం, ఇటీవల దవాఖానలో చేరడాన్ని.. దేవుడి హెచ్చరికగా అభివర్ణించారు. భారమైన హృదయంతో ఈ నిర్ణయం ప్రకటిస్తున్నానని, దీని వెనుక ఉన్న బాధేంటో తనకు మాత్రమే తెలుసునని చెప్పారు. రజినీ మక్కల్‌ మండ్రం సభ్యులకు, ప్రజలకు, అభిమానులకు తన నిర్ణయం నిరాశ కలిగించవచ్చని, ఇందుకు తనను మన్నించాలని కోరారు. అయితే పాలిటిక్స్‌తో సంబంధం లేకుండా ప్రజాసేవ కొనసాగిస్తానని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రజినీ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రజినీతో కలిసి తమిళనాడులో పాగా వేయాలని ప్రణాళిక రచిస్తున్న బీజేపీకి ఇది ఎదురుదెబ్బ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. రజినీ నిర్ణయం కాస్త నిరాశ కలిగించిందని, అయితే ఆయన ఆరోగ్యం ముఖ్యమని సహచర నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌ వ్యాఖ్యానించారు. 

వారిని బాధితులను చేయలేను..

బీపీ హెచ్చుతగ్గులతో ఇటీవల హైదరాబాద్‌లోని దవాఖానలో చేరిన రజినీ.. ఆదివారం డిశ్చార్జి అయ్యారు. తన అనారోగ్య పరిస్థి తుల నేపథ్యంలో తనతోపాటు రాజకీ య ప్రయాణం సాగించే సహచరులు మానసికంగా, ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొనవచ్చని, ఇలా తన మద్దతుదారులను బాధితులను చేయలేనని రజినీ పేర్కొన్నారు. 

1996 తొలిసారి రాజకీయ ప్రకటన

2020, డిసెంబర్ ‌29 పార్టీ పెట్టనన్నరజినీకాంత్‌

భారమైన హృదయంతో..

 బీపీ హెచ్చుతగ్గులకు గురవడం, తన ట్రాన్స్‌ప్లాంటెడ్‌ కిడ్నీపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని రజినీకాంత్‌ చెప్పారు. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ, 120 మంది సభ్యులున్న తమ చిత్ర బృందంలో (రజినీ ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్‌లో) నలుగురు కరోనా బారినపడ్డారని గుర్తుచేశారు. ఎన్నికల బరిలోకి దిగితే లక్షలాది మంది ప్రజలను కలువాల్సి ఉంటుందని.. సోషల్‌ మీడియాకే రాజకీయ ప్రచారం పరిమితమైతే అనుకున్న లక్ష్యం చేరుకోలేమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పారు. తమిళ ప్రజలను దేవుళ్లుగా అభివర్ణించిన ఆయన.. తన నిర్ణయాన్ని అంగీకరించాల్సింగా అభ్యర్థించారు.

భిన్నాభిప్రాయాలు..

రజినీకి సన్నిహితుడైన ఆరెస్సెస్‌ నేత గురుమూర్తి స్పందిస్తూ.. 1996లో లాగానే రజినీ ఈ సారి కూడా రాజకీయ ప్రభావం చూపగలరని అన్నారు. అన్నాడీఎంకే నేత ఆర్‌ఎం బాబు మురుగవేల్‌ మాట్లాడుతూ.. రజినీ రాజకీయాల్లోకి రారని 2017లోనే తాను చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. రజినీ ఉన్నా లేకున్నా అన్నాడీఎంకేపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. రజినీ నీడలో ఎదగాలనుకున్న బీజేపీకి ఇది ఎదురుదెబ్బ అని వీసీకే వ్యాఖ్యానించింది. అయితే మోదీ పనితీరే వచ్చే ఎన్నికల్లో తమకు మెరుగైన ఫలితాలను సాధించిపెడుతుందని బీజేపీ పేర్కొంది. మరోవైపు రజినీ తీసుకున్న నిర్ణయానికి ఆయన సోదరుడు సత్యనారాయణరావు మద్దతుగా నిలిచారు. 

దశాబ్దాలుగా ఊగిసలాట

రజినీ రాజకీయ ప్రవేశంపై మూడు దశాబ్దాలుగా ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. 1996 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో తొలిసారి ఆయన రాజకీయ ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. అయితే రజినీని కాదని కాంగ్రెస్‌.. అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్నది. ఈ క్రమంలో రజనీ తనదైన శైలిలో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ‘మళ్లీ జయలలిత అధికారంలోకి వస్తే, తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడు’ అని వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల్లో బాగా పనిచేసింది. అన్నాడీఎంకే ఓటమిపాలు కాగా, డీఎంకే అధికారంలోకి వచ్చింది. జయలలిత ఓటమికి తన ప్రకటనే కారణమని అనంతరకాలంలో రజినీ స్వయంగా పేర్కొన్నారు. 2004లో రజినీ ఎన్డీఏకు మద్దతునిచ్చారు. 2014 అక్టోబర్‌లో జైలు నుంచి విడుదలైన జయలలితతో ఆయన సమావేశం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె మళ్లీ సీఎం అవుతారని కూడా రజినీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన చెప్పినట్టుగానే.. జయ మళ్లీ అధికారంలోకి వచ్చారు. అయితే ఆ తర్వాత కొంతకాలానికి అనారోగ్యానికి గురై జయ కన్నుమూయటం, రాష్ట్రంలో రాజకీయ శూన్యత నేపథ్యంలో తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు  2017 డిసెంబర్‌లో రజినీ ప్రకటించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనున్నట్టు తెలిపారు. అనంతరం ఈ ఏడాది మార్చిలో రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. జనవరిలో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ఈ నెల 3న ప్రకటించిన ఆయన.. 31న వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. అయితే అంతలోనే రాజకీయ నిష్క్రమణ చేశారు.