మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 12:27:04

సుప్రీంకోర్టులో పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకున్న స్పీక‌ర్‌

సుప్రీంకోర్టులో పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకున్న స్పీక‌ర్‌

న్యూఢిల్లీ: తిరుగుబాటునేత‌ స‌‌చిన్ పైల‌ట్ వ‌ర్గం ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌తవేటుకు సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్‌ను రాజ‌స్థాన్ స్పీక‌ర్ సీపీ జోషి ఉప‌సంహ‌రించుకున్నారు. మాజీ ఉప‌ముఖ్య‌మంత్రి స‌చిన్ స‌హా 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల అన‌ర్హ‌త చ‌ర్య‌ల‌ను వాయిదా వేయాల‌ని జూలై 21న‌ రాజ‌స్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌వాల్ చేస్తూ స్పీక‌ర్ అత్యున్న‌త న్యాయ‌స్థానంలో స‌వాళ్ చేశారు. 

అయితే తాను దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు స్పీక‌ర్ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపిస్తున్న సీనియ‌ర్ న్యాయ‌వాది క‌పిల్ సిబ‌ల్ సుప్రీంకోర్టుకు వెల్ల‌డించారు. దీంతో జ‌స్టిస్ అరుణ్ మిశ్రా, జ‌స్టిస్ బీఆర్ గావాయ్‌, జ‌స్టిస్ కృష్ణ మురారితో కూడిన ధ‌ర్మాస‌నం పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తించింది. 

పార్టీ విప్‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించిన‌ అస‌మ్మ‌తి నేత స‌చిన్ పైల‌ట్ వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేల‌కు స్పీక‌ర్ అన‌ర్హ‌త నోటీసులు జారీచేశారు. దీనికి వ్య‌తిరేకంగా వారు రాజ‌స్థాన్ హైకోర్టును ఆశ్ర‌యించారు. తుది తీర్పు వ‌చ్చేవ‌రకు య‌థాత‌థ స్థితినే కొన‌సాగించాల‌ని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ స్పీక‌ర్ జోషి సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అది ఈ రోజు ముగ్గురు న్యాయ‌మూర్తులతో కూడిన ధ‌‌ర్మాస‌నం ముందుకు విచార‌ణ‌కు వ‌చ్చింది. 


logo